Raghavulu BV
-
రాష్ట్రాల అప్పులకు కేంద్రం ఆంక్షలు సరికాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు, షరతులు విధిస్తోందని, అనుమతి ఇచ్చేందుకు అనేక మెలికలు పెట్టి అదనపు భారాలు మోపుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందంటూ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ తప్పుబట్టారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో ఏపీతోపాటు అనేక రాష్ట్రాలు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. కేంద్రం కూడా ఇందుకు అతీతం కాదని చెప్పారు. కానీ రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారని, కేంద్రానికి మాత్రం షరతులు వర్తించవా.. అని ఆయన ప్రశ్నించారు. అనేక షరతులు పెట్టి రాష్ట్రాలు ప్రజలపై భారాలు మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. అప్పుల విషయంలో కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక న్యాయం అమలు జరుగుతోందన్నారు. ఈ వాస్తవాలకు సమాధానం చెప్పకుండా పురందేశ్వరి రాష్ట్రాలపై విమర్శలు చేయడం హిపోక్రసి (కపటత్వం) అవుతుందని ఎద్దేవా చేశారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు కూడా పాల్గొన్నారు. తుపాను బాధితులను ఆదుకోవాలి రాష్ట్రంలో తుపాను వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడలో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ఒక తీర్మానంలో ఈ మేరకు కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన వరద బాధిత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని విజ్ఞప్తి చేసింది. -
ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు: రాఘవులు
సాక్షి, కడప : గత ప్రభుత్వాల హయాంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైయ్యాయని సీపీఎం నాయకులు రాఘవులు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. భూములు ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాల్సిన గత టీడీపీ ప్రభుత్వం వారికీ సహకరించిందని విమర్శించారు. దీన్ని ప్రశ్నించిన స్థానికులపై టీడీపీ నాయకులు కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు, డికెటి భూములు, దళితులకు పంపిణీ చేసిన భూములు ఆక్రమణకు గురయ్యాయని దుయ్యబట్టారు. జిల్లాలో జరిగిన భూముల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భూములు దోపిడీకి గురైన ప్రాంతాల్లో పర్యటించామని, దీనిపై ఓ నివేదిక తయారు చేసి సీఎంకు అందిస్తామని తెలిపారు. -
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం
సాక్షి, ఒంగోలు టౌన్: ‘దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణకై తెరపైకి వచ్చిన జమిలి విధానం ప్రజాస్వామ్యానికి హానీకరం. జమిలి ఎన్నికల కారణంగా ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటోంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు బీజేపీ కుట్ర పన్నింది. కార్పొరేట్ శక్తుల కోసం చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైందని’ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో ‘జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ముప్పు, కేంద్ర బడ్జెట్ ఉద్యోగులు, ప్రజలపై దుష్ప్రభావాలు’ అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్‌కు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్న అంశాన్ని బీజేపీ తెలివిగా తెరపైకి తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి ట్రిప్పుకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళుతోందని, అయితే కొంతమంది ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నప్పటికీ పర్యవసానం మాత్రం ఇంకోలా ఉంటోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలి ఎన్నికలకు ముందుకు వెళితే, దాని ప్రభావం రాష్ట్రాలపై కూడా పడుతోందన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లో కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో నాలుగైదు దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయని, ఇటలీ, బ్రిటన్, స్విట్జర్లాండ్‌లో కూడా తక్కువ కాలపరిమితిలోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఆ సమయంలో ఖర్చు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆ విధానం అత్యంత ప్రమాదకరం అతి చిన్న ప్రభుత్వం – అత్యంత ఎక్కువ పరిపాలన అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చేసిన ప్రకటన అత్యంత ప్రమాదకరంగా ఉందని బీవీ రాఘవులు విమర్శించారు. అతి చిన్న ప్రభుత్వం అంటే అన్నీ చేయమని, అత్యంత ఎక్కువ పరిపాలన పేరుతో ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేట్‌పరం చేయబోతోందని ముందస్తు సంకేతాలు ఇచ్చిందన్నారు. ప్రజలకు అందించే సేవల నుండి తప్పుకొని ప్రైవేట్‌పరం చేయడమే కేంద్ర ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. విద్యారంగం, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, రవాణా రంగం, చివరకు రక్షణ రంగం నుంచి తప్పుకొని ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రెగ్యులేటరీ కమీషన్ల పేరుతో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటుందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 7 లక్షల కోట్ల లోటు చూపించారని, దానిని భర్తీ చేసేందుకు ప్రజలపై అదనపు భారాలు మోపనుందన్నారు. ఐఎంఎఫ్ సంస్థ దేశంలో అభివృద్ధి పడిపోతోందని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 235 సంస్థలను అమ్మివేయాలంటూ నీతి అయోగ్ ఇటీవల సూచించిందన్నారు. వేలాది మంది పనిచేసే సంస్థలను మూసివేస్తూ, పదిమందికి ఉపాధి కల్పించే వాటిని ఏర్పాటుచేస్తూ కేంద్రం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. పీపీపీ ద్వారా రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విధానం వల్ల చివరకు ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తూ ప్రైవేట్ వారికి పెత్తనం అప్పగిస్తోందన్నారు. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి కే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సెమినార్లో మాదాల వెంకట్రావు, ఎన్ రంగారావు పాల్గొన్నారు. రాష్ట్రానికి బీజేపీ మళ్లీ ద్రోహం చేసింది ఒంగోలు టౌన్: రాష్ట్రానికి బీజేపీ మళ్లీ ద్రోహం చేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీల అమలులో, రాజధాని నిర్మాణంలో సహకరించకపోగా, ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులకు కూడా అడ్డుపడుతోందని విమర్శించారు. శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీపై కారాలు, మిరియాలు నూరిన చంద్రబాబు, ఇప్పుడు పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా ఉమ్మడిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి జలాలు కృష్ణా నదికి తీసుకువచ్చే విషయమై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని, అంతకంటే ముందుగా ఈ విషయమై అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం ధూషణ, భూషణలకే పరిమితమైందన్నారు. కీలకమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంత ఆలస్యం జరిగితే అంత బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎదురు దెబ్బలు తాత్కాలికమే.. గత సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు బలం కలిగినచోట దానిని నిలుపుకోవడంలో విఫలమైనాయని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. తమకు గట్టి పట్టు ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి చెందడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతోపాటు తమ క్యాడర్‌ను, సానుభూతిపరులను భయభ్రాంతులకు గురిచేయడం ఓటింగ్‌పై ప్రభావం చూపాయన్నారు. తమ పార్టీకి తగిలిన ఎదురు దెబ్బలు తాత్కాలికమేనని, తిరిగి పుంజుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీవీ రాఘవులు వెంట సీపీఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఉన్నారు. -
ప్రత్యామ్నాయం మేమే
సాక్షి, కామారెడ్డి: ప్రజలవైపున్న వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అని సీపీఎం పొలిట్‌బ్యూరో బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీఎల్‌ఎఫ్‌తో కలిసి పాలక పార్టీలను ఓడిస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే ప్రాణాలకు తెగించి పోరాడారని, తెలంగాణ విమోచన దినోత్సవం జరపడంలో బీజేపీకి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని రాఘవులు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్ లో ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ రంకెలేశారని, ప్రస్తుతం కూనిరాగాలు తీస్తున్నారని విమర్శించారు. కుటుంబ లబ్ధి, అవినీతిని కప్పిపుచ్చుకోవడం, అధికార అవసరాల కోసమే కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ కూడా నేరవేర్చకుండా తన స్వలాభం కోసమే అసెంబ్లీని రద్దు చేశాడన్నారు. కేసీఆర్‌కు మతి భ్రమించిందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఇక ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాయమాటలైనా చెబుతాడని పేర్కొన్నారు. బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత నోట్ల రద్దు సమయంలో ప్రధాని ప్రకటించిన ఏ లక్ష్యం నెరవేరలేదని ఆర్బీఐ నివేదికలో వెల్లడైందని రాఘవులు పేర్కొన్నారు. జీఎస్టీ అస్తవ్యస్త అమలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ఇప్పట్లో ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితిలో లేదన్నారు. తప్పుడు గణాంకాలతో కేంద్ర సర్కారు వృద్ధి రేటుపై తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాగ్రహాన్ని గ్రహించే బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీయేను వదిలి బయటకు వస్తున్నాయన్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ దళితులు, గిరిజనులు, మహిళలకు తాయిలాలు ప్రకటించి తమవైపు తిప్పుకోవాలని ఆరాటపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే దేశంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తేడాలేదని రాఘవులు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా ధరలను నియంత్రించడం లేదన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేశారని, బీజేపీ సర్కారు వచ్చాక రోజువారీగా ధరల పెంపునకు అవకాశం కల్పించారని ఆరోపించారు. అవినీతికి ఊతం.. కాంగ్రెస్ అవినీతిపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. నాలుగున్నరేళ్ల కాలంలో అవినీతిపరులను శిక్షించకపోగా, విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ, చోక్సీలాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించిందని రాఘవులు విమర్శించారు. మా ల్యాను సాగనంపడంలో మోదీకి అతిదగ్గర అయిన ఓ సీబీఐ అధికారి సహకారం ఉన్నట్లు మీ డియాలో వచ్చిందన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. విమానాల తయారీ బాధ్యతను ఏమాత్రం అవగాహన లేని రిలయన్స్ సంస్థకు అప్పగించారని, అప్పుల్లో ఉన సంస్థను లాభాల బాటలో పట్టించడానికి ఈ పనిచేశారని అన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ కాంగ్రెస్ కుటుంబ పాలన అంతమొందించి ప్రజాస్వామ్య పాలన అందిస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటరీ వ్యవస్థను నీరుగార్చిందని రాఘవులు విమర్శించారు. రాజ్యసభలో చర్చ జరుగకుండా కీలక బిల్లులను ద్రవ్య బిల్లులుగా తీసుకువచ్చారన్నారు. న్యాయ వ్యవస్థలో కొలీజియం సిఫారసులను అణచిపెట్టి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం చేస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చార ని ఆరోపించారు. మద్దతు ధర బూటకం.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు పెద్ద బూటకమని రాఘవులు పేర్కొన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్ఘడ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆందోళనబాట పడుతున్నారన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయానికి, లౌకిక వ్యవస్థకు, పౌరహక్కులకు విఘాతం కలుగుతుందని, తీవ్ర నిరంకు శ ధోరణి ప్రబలుతుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఢీకొట్టే పరిస్థితి కాంగ్రెస్‌కు లేనందున బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకరించి ఆ పార్టీని ఓడించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళితే బీజేపీ వ్యతిరేక పోరాటం బలహీనమవుతుందన్నారు. కాంగ్రె స్ హిందువుల పార్టీగా ముద్ర వేసుకునేందుకు తహతహలాడుతోందని, హిందూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సరళీకరణ ఆర్థిక విధానాలతో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ విధానాలతో సీపీఎం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ నిరంకుశ పాలన సాగిస్తున్నాయని రాఘవులు ఆరోపించారు. సెప్టెంబర్ 17 న విమోచన దినం ఎందుకు జరపడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం చేస్తున్న పోడు పోరాటం, కులవివక్షపై సమరం, నిర్వాసితులు, కార్మికుల హక్కులపై పోరాటాలు అభినందనీయమని, ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. మూడంచెల ఎత్తుగడ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మూడంచెల ఎత్తుగడను అనుసరిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలవకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, సీపీఎం భాగస్వామ్యంతో ఏర్పడ్డ బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి బలం పెంచుకుంటామని, బలం లేని ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రాన్ని సామాజిక అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పార్టీ కేంద్ర కమిటీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జ్యోతి, పోతునేని సుదర్శన్, సాయిబాబు, చుక్కరాములు, భాస్కర్, వెంకట్రాములు, చంద్రశేఖర్, సిద్దిరాములు, వెంకట్‌గౌడ్, మోతిరాం, రేణుక, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. నేడు ర్యాలీ, బహిరంగ సభ సీపీఎం రాష్ట్ర సమావేశాల్లో భాగంగా నేడు గాంధీ గంజ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ సుభాష్‌రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, నిజాంసాగర్‌చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
‘బీజేపీ పకోడీ రాజకీయాలు చేస్తోంది’
నల్గొండ :కేంద్రంలో బీజేపీ పకోడీ రాజకీయాలు చేస్తోందని, పకోడీలు చేసేవారిని అవమానించే విధంగా ప్రవర్తిస్తోందని సీపీఎం సీనియర్ నేత బీవీరాఘవులు విమర్శించారు. నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను బలపరుస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా తప్పులు కప్పి పుచ్చుకునే విధంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే రంగాలలో ఉపాధి కల్పించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ విఫలం అయిందని విమర్శించారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులు కాలక్షేపం చేశారు తప్ప కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని విమర్శించారు. విభజన చట్టం హామీల గురించి కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాలుగు సంవత్సరాల్లో కేంద్రం ప్రకటించిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేసి కేంద్రంపై పోరాడాలని సూచించారు. -
ఆత్మహత్యలు పెరిగే అవకాశముంది: ఏచూరీ
నల్గొండ : రైతుల రుణమాఫీ చేయకపోవడంతో రైతుల ఫై రుణభారం పెరిగి రైతు ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. సీపీఎం రాష్ట్ర సభ ఆదివారం నల్గొండలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం మతఘర్షణలు ఎక్కువయ్యాయని, మతోన్మాదం ఎక్కువై ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ దేశ ప్రజలను భ్రమలకీ గురి చేస్తూ, హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి వాటి ద్వారా ఓటు బ్యాంకు సంపాదించాలనుకుంటున్నానడని ఆరోపించారు. సీపీఎం సీనియర్ నేత రాఘవులు మాట్లాడుతూ..గత 4 సంవత్సరాలుగా బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మహారాష్ట్రలోని దళితులపై బీజేపీ దాడులకు పాల్పడుతుందని, చిన్న పిల్లల ఫై అఘాయిత్యాలకు పాల్పడుతూ,ఎంతో చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ మన నిర్మాణం కాదంటూ అవమాన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. -
రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ వాడుకుంటోంది
బీవీ రాఘవులు విమర్శ సాక్షి, న్యూఢిల్లీ: ముస్లిం మైనారిటీల్లో వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉండా లన్న డిమాండ్ చా లాకాలంగా ఉందని, తెలంగాణలో రిజర్వేషన్లలో మార్పులు చేయడం సమంజసమేనని సీపీఎం పొలి ట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యా యి.బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేం దుకు మతప్రాదికన రిజర్వేషన్లు కల్పిస్తు న్నారన్న ప్రచారం చేస్తూ ఈ అంశాన్ని వాడుకుంటోందన్నారు. మొత్తం రిజర్వే షన్ల శాతం 50 శాతానికి మించితే కోర్టులో నిలబడదని, 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తొలగించి రిజర్వేషన్ల శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. -
సంతలో గొడ్డుల్లా కొంటున్నారు
సీఎం చంద్రబాబుపై సీపీఎం నేత రాఘవులు ఫైర్ ♦ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే అప్రజాస్వామికమా? ♦ ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనడం దేశసేవా? ♦ ప్రజాస్వామ్యాన్ని అంగడి సరుకుగా మార్చేశారు ♦ పరిస్థితులు మార్చడానికి అంతా నడుంకట్టాలి సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను సంతలో గొడ్డుల్లా కొంటున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు అమ్ముడుపోతే ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టారని, అదే చంద్రబాబు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ తమ అభివృ ద్ధిని చూసి వస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అక్కడేమో అన్యాయం అయితే.. ఇక్కడ రాష్ట్రాభివృద్ధి, దేశభక్తి, దేశసేవ అవుతుందా? అని ప్రశ్నించారు. ఓటుకు రేటు కట్టిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలకు వెల కడుతున్నారని.. చివరకు ప్రజాస్వామ్యాన్ని అంగడి సరకుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకినేని బసవపున్నయ్య(ఎంబీ) 24వ వర్థంతి సందర్భంగా విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యాపార ధోరణి కారణంగా సాధారణ ఓటరుకు రూ. 500 రేటు పలికితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు రూ. 5 వేలు ఇచ్చారని, ఇప్పుడు ఎమ్మెల్యేలకు రూ.10 కోట్లు పైనే రేటు కడుతున్నారని, ఎంపీకి గతంలోనే రూ. వంద కోట్లకుపైగా ధర పలికిందని రాఘవులు చెప్పారు. రాజకీయాలు డిమాండ్ సప్లయ్ పద్ధతిలో ధర నిర్ణయించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. సరళీకరణ విధానాల పర్యవసానంగా అన్నీ కొనడానికి అమ్మడానికి పనికొచ్చేలా సిద్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులులేని ప్రజాస్వామ్యవాదులు నెగ్గుకురాలేరన్నారు. మాకినేని బతికుంటే ఈ పోకడలపై పోరాటం చేసేవారని, ఆయన రచనలను ఇంగ్లిషుతో పాటు తెలుగులో తీసుకురావాలని రాఘవులు కోరారు. ఈ సందర్భంగా నాలుగు సంపుటాలుగా రూపొందించిన ఎంబీ రచనలు, ఉపన్యాసాలను రాఘవులు ఆవిష్కరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజాశక్తి ఎడిటర్ పాటూరి రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు, ప్రజాశక్తి బుక్‌హౌస్ ఎడిటర్ కె.ఉషారాణి, ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీ కృష్ణ మాట్లాడారు. టీడీపీది రాజకీయ వ్యాపారం సీపీఎం నేత ప్రకాశ్ కారత్ విమర్శ డబ్బున్న వారికే పార్టీలు టికెట్లు ఇచ్చే సంస్కృతికి రాజకీయాలు దిగజారిపోయాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ రాజకీయ వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. మాకినేని బసవపున్నయ్య(ఎంబీ) వర్థంతి సందర్భంగా విజయవాడలో స్మారకోపన్యాసం పేరుతో ‘25 ఏళ్ల సరళీకరణ విధానాలు-ఫలితాలు’ అనే అంశంపై కరత్ ప్రసంగిస్తూ రాజకీయ విధానాలను విళ్లేషించారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి పరిస్థితి, తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల స్థితి చూస్తే రాజకీయాల్లో విలువలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థమవుతుందన్నారు. పారిశ్రామికవేత్తలకే టికెట్లు ఇచ్చి గెలిపిస్తే వారు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారని, ప్రజలను ఎవరు పట్టించుకుంటారని కరత్ ప్రశ్నించారు.