సీపీఎం జెండాను ఆవిష్కరిస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి
సాక్షి, కామారెడ్డి: ప్రజలవైపున్న వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అని సీపీఎం పొలిట్‌బ్యూరో బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీఎల్‌ఎఫ్‌తో కలిసి పాలక పార్టీలను ఓడిస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే ప్రాణాలకు తెగించి పోరాడారని, తెలంగాణ విమోచన దినోత్సవం జరపడంలో బీజేపీకి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని రాఘవులు విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్ లో ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ రంకెలేశారని, ప్రస్తుతం కూనిరాగాలు తీస్తున్నారని విమర్శించారు. కుటుంబ లబ్ధి, అవినీతిని కప్పిపుచ్చుకోవడం, అధికార అవసరాల కోసమే కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ కూడా నేరవేర్చకుండా తన స్వలాభం కోసమే అసెంబ్లీని రద్దు చేశాడన్నారు. కేసీఆర్‌కు మతి భ్రమించిందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఇక ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాయమాటలైనా చెబుతాడని పేర్కొన్నారు.
బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత
నోట్ల రద్దు సమయంలో ప్రధాని ప్రకటించిన ఏ లక్ష్యం నెరవేరలేదని ఆర్‌బీఐ నివేదికలో వెల్లడైందని రాఘవులు పేర్కొన్నారు. జీఎస్టీ అస్తవ్యస్త అమలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ఇప్పట్లో ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితిలో లేదన్నారు. తప్పుడు గణాంకాలతో కేంద్ర సర్కారు వృద్ధి రేటుపై తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాగ్రహాన్ని గ్రహించే బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీయేను వదిలి బయటకు వస్తున్నాయన్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ దళితులు, గిరిజనులు, మహిళలకు తాయిలాలు ప్రకటించి తమవైపు తిప్పుకోవాలని ఆరాటపడుతోందని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే
దేశంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి తేడాలేదని రాఘవులు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా ధరలను నియంత్రించడం లేదన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేశారని, బీజేపీ సర్కారు వచ్చాక రోజువారీగా ధరల పెంపునకు అవకాశం కల్పించారని ఆరోపించారు.
అవినీతికి ఊతం..
కాంగ్రెస్ అవినీతిపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. నాలుగున్నరేళ్ల కాలంలో అవినీతిపరులను శిక్షించకపోగా, విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ, చోక్సీలాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించిందని రాఘవులు విమర్శించారు. మా ల్యాను సాగనంపడంలో మోదీకి అతిదగ్గర అయిన ఓ సీబీఐ అధికారి సహకారం ఉన్నట్లు మీ డియాలో వచ్చిందన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. విమానాల తయారీ బాధ్యతను ఏమాత్రం అవగాహన లేని రిలయన్స్ సంస్థకు అప్పగించారని, అప్పుల్లో ఉన సంస్థను లాభాల బాటలో పట్టించడానికి ఈ పనిచేశారని అన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
కాంగ్రెస్ కుటుంబ పాలన అంతమొందించి ప్రజాస్వామ్య పాలన అందిస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటరీ వ్యవస్థను నీరుగార్చిందని రాఘవులు విమర్శించారు. రాజ్యసభలో చర్చ జరుగకుండా కీలక బిల్లులను ద్రవ్య బిల్లులుగా తీసుకువచ్చారన్నారు. న్యాయ వ్యవస్థలో కొలీజియం సిఫారసులను అణచిపెట్టి న్యాయమూర్తుల నియామకంలో జాప్యం చేస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చార ని ఆరోపించారు.
మద్దతు ధర బూటకం..
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు పెద్ద బూటకమని రాఘవులు పేర్కొన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆందోళనబాట పడుతున్నారన్నారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయానికి, లౌకిక వ్యవస్థకు, పౌరహక్కులకు విఘాతం కలుగుతుందని, తీవ్ర నిరంకు శ ధోరణి ప్రబలుతుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని ఢీకొట్టే పరిస్థితి కాంగ్రెస్‌కు లేనందున బీజేపీ వ్యతిరేక ఓట్లను సమీకరించి ఆ పార్టీని ఓడించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళితే బీజేపీ వ్యతిరేక పోరాటం బలహీనమవుతుందన్నారు. కాంగ్రె స్ హిందువుల పార్టీగా ముద్ర వేసుకునేందుకు తహతహలాడుతోందని, హిందూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సరళీకరణ ఆర్థిక విధానాలతో ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ విధానాలతో సీపీఎం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఏపీలో టీడీపీ నిరంకుశ పాలన సాగిస్తున్నాయని రాఘవులు ఆరోపించారు. సెప్టెంబర్ 17 న విమోచన దినం ఎందుకు జరపడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం చేస్తున్న పోడు పోరాటం, కులవివక్షపై సమరం, నిర్వాసితులు, కార్మికుల హక్కులపై పోరాటాలు అభినందనీయమని, ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు.
మూడంచెల ఎత్తుగడ
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మూడంచెల ఎత్తుగడను అనుసరిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలవకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, సీపీఎం భాగస్వామ్యంతో ఏర్పడ్డ బీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి బలం పెంచుకుంటామని, బలం లేని ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులకు మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రాన్ని సామాజిక అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పార్టీ కేంద్ర కమిటీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జ్యోతి, పోతునేని సుదర్శన్, సాయిబాబు, చుక్కరాములు, భాస్కర్, వెంకట్‌రాములు, చంద్రశేఖర్, సిద్దిరాములు, వెంకట్‌గౌడ్, మోతిరాం, రేణుక, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
నేడు ర్యాలీ, బహిరంగ సభ
సీపీఎం రాష్ట్ర సమావేశాల్లో భాగంగా నేడు గాంధీ గంజ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ సుభాష్‌రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, నిజాంసాగర్‌చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు సాగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment