రొళ్ల : ప్రధాని నరేంద్రమోది, ముఖ్యమంత్రి చంద్రబాబు తోడుదొంగలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రొళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ప్రజాబ్యాలెట్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఐదు ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ చాలని చంద్రబాబు తెలపడం సిగ్గు చేటన్నారు. 2012లోనే జీడీపల్లి రిజర్వాయర్‌కు నీరు తెచ్చామన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక నీరు తీసుకుచ్చామని చెప్పడం దగాకోరుతనమన్నారు.
కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు. రైతులు, డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులు, చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసగించారని మండిపడ్డారు. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించాలన్న ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో 108 సేవలు పూర్తి స్థాయిలో అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు మాయ మాటలు రాష్ట్ర ప్రజలు ఇక మీద నమ్మరని, 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గల్లంతై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, కాంగ్రెస్ కన్వీనర్లు డా.గౌడప్ప,నాగరాజు,సింగిల్‌విండో అధ్యక్షుడు సంతోష్,మాజీ ఎంపీపీ దేవరాజు,మైనార్టీ సెల్ కన్వీనర్ అన్వర్, నాయకులు పాల్గొన్నారు.
మోదీ,బాబు తోడుదొంగలు.!
Published Fri, Mar 24 2017 12:08 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement