
చంద్రబాబూ.. రాజధానికి మూడుసార్లు శంకుస్థాపనలా?
అవనిగడ్డ: రాజధాని నిర్మాణానికి మూడు సార్లు శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వింత పనులు ఎన్నడూ చూడలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ వద్ద స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి చంద్రబాబు, మరోసారి ప్రధానమంత్రి, మళ్లే తానే రాజధాని కోసం శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం మూడుసార్లు శంకుస్థాపనలు చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.
రాష్ట్రం విడిపోయి రెండేళ్లయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి రూ.40 వేల కోట్లు అవసరం కాగా, చంద్రబాబు రూ.1,500 కోట్లు అడిగితే కేంద్రం రూ.200 కోట్లు భిక్షమేసిందన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు అందజేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణంతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం తప్ప ప్రయోజనం ఉండదని, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని విమర్శించారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర భూములు లాక్కుని బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ కంపెనీలకు వాటిని కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు.
ప్రజావిశ్వాసం కోల్పోయిన చంద్రబాబు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని రఘువీరా డిమాండ్‌చేశారు. కర్ణాటక, తమిళనాడుల్లో అమలులో ఉన్న విధానాన్ని అవలంబించేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయాడని. ఇందులోనూ ఆయన రికార్డు సృష్టించాడని ఎద్దేవా చేశారు. తొలుత మోపిదేవి వార్పు నుంచి మోటార్ సైకిళ్లతో ర్యాలీగా పీసీసీ అధ్యక్షుడిని తీసుకొచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవనేని అవినాష్, డీసీసీ కార్యదర్శి ఆది రామ్మోహనరావు, మండల పార్టీ అధ్యక్షుడు దిడ్ల వీరరాఘవులు, నాయకులు మహ్మద్‌గౌస్ తిలక్, శీలం నారాయణ, వరలక్ష్మి పాల్గొన్నారు.