వరాలు ఇచ్చేనా
వరాలు ఇచ్చేనా
Published Tue, Aug 23 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
నేడు విజయవాడకు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రాక
పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం
నంద్యాల – కడప లైను ప్రారంభం
సాక్షి, విజయవాడ :
రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం నగరానికి రానున్నారు. పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరిస్తారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయం చేరుకుని అక్కడ నుంచే నంద్యాల – ఎర్రగంట్ల రైల్వేలైనును, నంద్యాల– కడప పాసింజర్ రైలును రిమోట్ వీడియో లింక్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. ఏపీలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారోలనూ సమీక్షిస్తారని తెలిసింది. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ప్రభు ఇప్పటికే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.తొలిసారిగా ఆయన విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ– అమరావతి రైల్వే లైను నిర్మాణానికి సర్వే చేయించేందుకు శ్రీకారం చుట్టారు. రెండవసారి వచ్చినప్పుడు విజయవాడ– సికింద్రాబాద్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేశారు. తాజాగా విజయవాడ–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చి రాయలసీమ వాసులు రాష్ట్రానికి వచ్చేందుకు వీలు కల్పించారు. ఈసారి ఏమీ వరాలు ఇస్తారనే అంశంపై రైల్వే వర్గాలో చర్చ జరుగుతోంది.
ఈ క్రింద అంశాలపై సురేష్ ప్రభు దృష్టి పెడితే ఈ ప్రాంతవాసులకు
ఉపయుక్తంగా ఉంటుందని అధికార, అనధికార వర్గాలు భావిస్తున్నాయి.
–విశాఖపట్నం–తిరుపతి, విశాఖపట్నం– సికింద్రాబాద్ వయా విజయవాడ మీదగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు ఇప్పటికే ట్రయిల్ రన్‌ను అధికారులు పూర్తి చేశారు. కేవలం రైల్వే బోర్డు నుంచి అనుమతులు వస్తే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది. పుష్కరాల్లో వీటిని నడపాలని చూసినా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాలేదు. వీటిని మంజూరు చేస్తే ఉపయుక్తంగా వుంటుంది.
– విజయవాడ రైల్వే స్టేషన్‌లో మరో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి చాలా అవసరం. గతంలో ఉన్న పుట్ ఓవర్ బ్రిడ్జికి ఒకవైపు మెట్లు తీసివేసి ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకవైపు రైలు ఎక్కేవాళ్లు దిగేవాళ్లు వస్తూ ఉండటంతో తొక్కిసలాట జరుగుతోంది.
– పుష్కరాల సందర్భంగా గుణదల, మధురానగర్, కృష్ణాకెనాల్, రాయనపాడు రైల్వేస్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా మార్చారు. పుష్కరాల తరువాత దీన్ని కొనసాగిస్తే విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
– విజయవాడ నుంచి నాగోర్ (నాగపట్నం), అహ్మదాబాద్, ముంబాయి, షిర్డీ, కోల్‌కతాలకు కొత్త రైళ్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– విజయవాడ– గుడివాడ– నర్సాపురం– భీమవరం– మచిలీపట్నం, గుంటూరు– తెనాలి లైన్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.120 కోట్లు గతంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో గుంటూరు–తెనాలి లైను రూ.20 కోట్లు మిగిలిన వంద కోట్లు మొదటి లైనుకు కేటాయిస్తారు. ఈ రెండు లైన్లు పూర్తి చేయడానికి రూ.1,140 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేయగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని వేగవంతం చేయించాల్సి ఉంది.
Advertisement