వానలు ఫుల్.. మొక్కలు నిల్!
♦ సందిగ్ధంలో ‘హరితహారం’
♦ అప్పట్లో వర్షాలు లేక మొక్కలు మట్టిపాలు
♦ ప్రస్తుతం విస్తారంగా వానలు.. కరువైన మొక్కలు
♦ నర్సరీలు మొత్తం ఖాళీ
♦ అయోమయంలో అధికారులు
‘అడిగిన మొక్కనిస్తాం.. నాటి సంరక్షించండి’ అంటూ ప్రచార ఆర్భాటంతో ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కీలక సమయంలో సందిగ్ధంలో పడింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి మొక్కలు నాటే క్రతువులో ప్రజల్ని భాగస్వామ్యం చేసింది. విరివిగా మొక్కలు పంపిణీ చేసి ప్రోత్సహించింది. అప్పట్లో వర్షాలు సహకరించకపోవడంతో మెజార్టీశాతం మెక్కలు మట్టిపాలయ్యాయి. తాజాగా వర్షాలు సంతృప్తికరంగా కురుస్తుండగా... నాటేందుకు మాత్రం మొక్కలు కరువయ్యాయి. అటు నీటి యాజమాన్య సంస్థ, ఇటు అటవీ శాఖవద్ద మొక్కలు నిండుకోవడంతో ఆయా శాఖల అధికారులు దిక్కులు చూస్తున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఈ ఏడాది జిల్లాలో 2.12కోట్ల మొక్కలు నాటేలా యంత్రాంగం ప్రణాళిక రచించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జిల్లాలో 1.41కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగాన్ని వర్షాభావ పరిస్థితులు తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో లక్ష్యం గాడి తప్పింది. ఇప్పటివరకు 1.35కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడడంతో మొక్కలు నాటేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ నర్సరీల్లో మొక్కలు అందుబాటులో లేకపోవడంతో హరితహారం డైలమాలో పడింది. నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖల పరిధిలోని నర్సరీలు ఖాళీ అయ్యాయి. హరితహారం కింద భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న యంత్రాంగానికి చివర్లో ఎదురుదెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభంలో అధికారులు విరివిగా మొక్కలు నాటుతూ వచ్చారు. వర్షాభావ పరిస్థితులతో పెద్ద సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. మరోవైపు నర్సరీల్లోనూ భారీగా మొక్కలు మట్టిపాలయ్యాయి. దీంతో నిర్దేశిత లక్ష్యంలో పురోగతి సగమవగా... అందులో ప్రాణం పోసుకున్నవి అరకొరే.
–––––––––––––––––––––––––––
ప్రధాన శాఖలు నాటిన మొక్కలు (లక్షల్లో..)
–––––––––––––––––––––––––––
శాఖ నాటింది
డ్వామా 25.76
డీఆర్‌డీఏ 11.62
వ్యవసాయ 22.52
జీహెచ్‌ఎంసీ 84.91
హెచ్‌ఎండీఏ 60.89
ప్రైవేటు సంస్థలు 37.93