- మొక్కలపై నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తప్పవు
- మంత్రి జోగు రామన్న హెచ్చరిక
నాటకుండా పడేస్తారా?
Published Fri, Aug 5 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
జన్నారం : హరితహారం గురించి రాష్ట్రమంతా కలిసి సాగుతుంటే తెచ్చిన మొక్కలను నాటకుండా పడేస్తారా.. గత పది రోజుల క్రితం నేను వచ్చి నాటినప్పుడు పడేసిన మొక్కలు ఇప్పటికీ అలాగే ఉంచుతారా..ఏం తమాషా చేస్తున్నారా... నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు అని అటవీశాఖ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
పది రోజుల క్రితం హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం 800 మొక్కలు తీసుకువచ్చారు. విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు మొక్కలు నాటారు. మంత్రి వెళ్లిపోయిన మరుక్షణమే మొక్కలను గుంతల వద్దే వదిలేసి వెళ్లారు. శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేయగా ఎక్కడి మొక్కలు అక్కడే పడేసి ఉన్నాయి. కొన్ని మొక్కలు చనిపోయాయి. వాటిని చూసిన మంత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న వారెవ్వరు అని పిలువగా సెక్యురిటీ గార్డులు వచ్చారు. మొక్కలపై ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అధికారులు ఎక్కడున్నారని ఆరా తీశారు. తహశీల్దార్ రావాల్సిందిగా కోరడంతో అందుబాటులో లేరు. దీంతో పడేసిన మొక్కలను ఆయన తీసి పక్కన పెట్టారు. మొక్కలు దొరక్కా కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడ తెచ్చిన మొక్కలను నాటకుండా తమాషా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్‌ను ఆదేశించారు.
Advertisement