ఎండిపోయిన వరి నారుని చూపిస్తున్న మహిళా రైతులు
-
వేసవిని తలపిస్తున్న ఎండలు
-
ఆగస్టు నెల సగం గడిచినా కురవని వర్షాలు
-
నీరు లేక జరగని ఉభాలు
-
ఆందోళనలో అన్నదాత
-
శనివారం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వరుణుడు కరుణ
ఆగస్టు నెల వేసవిని తలపిస్తోంది. భానుడు భగభగమండిపోతున్నాడు. ఈ పరిస్థితితో అన్నదాతలో ఆందోళన నెలకొంది. ఆగస్టు మాసం సగం గడిచినా వరుణుడు కరుణించకపోవడంతో సాగునీరు లేక వరి ఉభాలు ఎక్కడా జరగలేదు. పగలంతా మండుటెండ..మధ్యాహ్నం తరువాత దట్టమైన మేఘాలు వస్తున్నా.. చినుకు మాత్రం రాలకపోవడం రైతన్నను కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వర్షం పడినా.. పొలాల్లో నీరు చేరకపోవడంతో వరినాట్లు వేసేందుకు అవకాశం లేదని రైతులు చెబుతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్:
వర్షాకాల వాతావరణం జిల్లాలో కానరావడం లేదు. వేసవిని తలపించేలా ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరుణ దేవుడు కరుణించకపోవడంతో ఎక్కడ కరువు ముంచుకువస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పనులు చురుగ్గా జరగాల్సిన సమయంలో ఎండలు కాస్తుండడంతో భవిష్యత్ ఎలా ఉంటుందోనని దిగులు చెందుతున్నాడు. గడిచిన పది రోజులుగా గరిష్ట ఉష్ఠ్రోగ్రత 34 నుంచి 39 డిగ్రీలు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎంతో ఆందోళనగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శనివారం మధ్యాహ్నం నమోదైన 39 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం అవస్థలు పడ్డారు.
ముఖం చాటేసిన వరుణుడు
ఆగస్టు నెలలో వరుణ దేవుడు ముఖం చాటేశాడు. చిరు జల్లులు తప్పితే పొలాల్లో నీరు చేరే పరిస్థితి లేదు. శనివారం కూడా శ్రీకాకుళం మండలంలో మోస్తరు వర్షం పడింది తప్పితే..జిల్లా వ్యాప్తంగా ఆ స్థాయిలో వాన పడలేదు. టెక్కలి, నరసన్నపేట, పలాస, రాజాంలో చిరు జల్లులే పడ్డాయి. జూలై నెలలో కురిసిన వర్షంతో అక్కడక్కడ పడిన నాట్లు కూడా ప్రస్తుతం కాస్తున్న ఎండలకు నీరు లేక ఎండిపోతున్నాయి.
– జిల్లాలోని 38 మండలాల్లో కేవలం పాతపట్నం, మందస, కోటబోమ్మాళిలో మాత్రమే ఆగస్టు మెుదటి వారంలో సగటు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం డివిజన్లో 13 మండలాలుండగా.. 12 మండలాల్లో వర్షం సగటు కంటే తక్కువగా నమోదైంది. టెక్కలి డివిజన్‌లో 12 మండలాకు పది మండలాల్లో, పాలకొండ డివిజన్‌లోని 13 మండలాల్లో సగటు కంటే తక్కువ వర్షం పడింది. ఇక శనివారం శ్రీకాకుళం టౌన్, టెక్కలి. నరసన్నపేట, పలాస, రాజాంలో తదితర ప్రాంతాల్లో చిరు జల్లులతోనే సరిపెట్టింది.
– ఈ ఖరీఫ్ రైతుల పాలిట శాపంగా మారింది. సీజన్ ప్రారంభలో వర్షాలు కురవడంతో రైతులు సంబర పడ్డారు. తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆగస్టు నెల మరింత ఆందోళనగా మారింది. గడిచిన 13 రోజుల్లో వరుణ దేవుడు జాడే లేదు.
– తోటపల్లి, వంశధార, మడ్డువలస, నారాయణపరం రిజర్వాయర్ల పరిధిలో కొద్దిగా ఉభాలు జరిగినప్పటికీ సాగునీరు సక్రమంగా సాగునీరు అందడం లేదనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతాలకు అసలు నీరే చేరని పరిస్థితి.
– ఎచ్చెర్ల, లావేరు, రణస్థలంం శివారు భూమలకు సాగునీరు అందడంలేదు. ఎచ్చెర్లలో సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు కష్టమవుతోంది. జి.సిగడాం మండలంలో సుమారు వెయ్యి ఎకరాలు నీరు లేక బీడువారి దర్శనమిస్తున్నాయి.
– పాలకొండ, వీరఘట్టం, భామిని మండలాల్లో 16 వేలకు పైబడి చిన్న, సన్నకారు రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. తోటపల్లి కాలువల ద్వారా నీరు విడిచిపెట్టకపోవడంతో పాలకొండ మండలం రైతులు ఇరిగేషన్ కార్యాలయాన్ని కూడా ఇటీవల ముట్టడించారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.