మాజీ ఎంపీ రాజయ్య కుటుంబానికి బెయిల్
వరంగల్ లీగల్: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్‌లకు గురువారం నాల్గవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి రఘునాథ్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గతేడాది నవంబర్ 4న రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కుమారులు సజీవదహనం అయిన ఘటనలో రాజయ్య, అనిల్‌కుమార్, మాధవి, అనిల్ రెండో భార్య సనా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. నిందితులు పలుమార్లు మున్సిఫ్ కోర్టు, జిల్లా కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసుకున్నా పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
జ్యుడీషియల్ కస్టడీలో ఉండి 90 రోజులు గడిచినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేసుకోగా షరతులతో కూడిన బెరుుల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ. 25 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటలలోపు సుబేదారి పోలీసుస్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించింది.
అలాగే, ఈనెల 15 వరకు ముగ్గురు నిందితులకు ఎలాంటి పాసుపోర్టులు ఉన్నా కోర్టుకు అందజేయాలని షరతు విధించింది. నాల్గవ నిందితురాలు అయిన సనా ఇప్పటి వరకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోలేదు.