
గోదావరి సెంటిమెంట్‌తోనే ‘సరైనోడు’ హిట్
‘సాక్షి’తో సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్
‘కెరటం’లా తెలుగు చిత్ర పరిశ్రమకు చేరి.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో గుర్తింపు తెచ్చుకుని.. ‘కరెంట్ తీగ’లా నాజూగ్గా ఉంటూ ‘లౌక్యం’గా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులు ‘పండగ చేస్కో’నేలా.. వారికి డబుల్ ‘కిక్’నిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. బ్రూస్‌లీతో జతకట్టి.. ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ ‘సరైనోడు’ వంటి హీరోలకు సరైన జోడీ అనిపించుకున్న ఆమె బుధవారం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. వైభవ్ జ్యూయలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రకుల్ ‘సాక్షి’తో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
గోదావరి ప్రాంతమంటే చాలా ఇష్టం..
గోదావరి ప్రాంతమంటే చాలా ఇష్టం. ఇక్కడికి అల్లు అర్జున్‌తో కలిసి సరైనోడు సినిమా షూటింగ్‌కి వచ్చా.. ఇక్కడి ప్రజల ఆదరణ మరువలేనిది. వాతావరణం, తిండి చాలా బాగున్నాయి. షూటింగ్ జరిగింది రెండురోజులైనా నాకు మర్చిపోలేని అనుభూతి. సినిమా వాళ్లకు గోదావరి సెంటిమంట్ అంటే ఏమిటో అనుకున్నా అది ‘సరైనోడు’ సినిమాతో తెలిసింది.
గత అనుభవాలు..
నేను పుట్టింది దిల్లీలో. ఇంటర్ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చా. తర్వాత డిగ్రీ పూర్తి చేశా. నా తొలిసినిమా కన్నడంలో ‘గిల్లీ’ దానిలో హీరోయిన్‌గా చేశా. తెలుగులోకి వచ్చేసరికి తొలిసినిమా ‘కెరటం’. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన లౌక్యం, మంచు మనోజ్‌తో కరెంటుతీగ, రామ్‌తో పండగచేస్కో, రామ్‌చరణ్‌తో బ్రూస్‌లీ, ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో సినిమాల్లో నటించాను. ఇటీవల విడుదలై.. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోన్న ‘సరైనోడు’తో మరింత బ్రేక్ వచ్చింది. బాలీవుడ్‌లోనూ ట్రై చేశా. ప్రస్తుతం నేను హీరోయిన్‌గా నటించిన ‘సిమ్లా మిర్చి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు తెలుగు, కన్నడం, తమిళం, హిందీ మొత్తం నాలుగు భాషల్లో నటించాను.
వస్తే వదులుకోను..
ప్రత్యేకంగా ‘ఇలాంటి’ పాత్రలే చేయాలని లేదు. ఏ పాత్ర అయినా చేస్తాను. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ వస్తే వదులుకోను. కచ్చితంగా చేస్తా.
రూమర్లు మామూలే..
తెలుగు చిత్రపరిశ్రమలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో ఒక సొంతిల్లు కొనుక్కున్నాను. దానిపై రూమర్లు వచ్చాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా(నవ్వుతూ) ఈ రూమర్లు మామూలే. వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం.
బాగా ఇష్టమైనది..
రాజమహేంద్రవరంలో నాకు బాగా నచ్చింది పాలగంగరాజు కోవా.. దానిని షూటింగ్ టైంలో తెప్పించుకుని తిన్నా..