పవన్ తీరుతో మోసపోవాలా?
♦ కాపులను వంచిస్తున్న చంద్రబాబు
♦ కాపు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రమణ ఆగ్రహం
తిరుపతి అర్బన్: ‘‘రాజకీయంగా ఏదో చేస్తారని, ఉద్ధరిస్తారని గతంలో చిరంజీవిని నమ్మి మోసపోయాం. ఇప్పుడు పవన్ కల్యాణ్ తీరుతో మేము మళ్లీ మోసపోవాలా?’’ అని కాపు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఓవీ రమణ ప్రశ్నించారు. ఆయన గురువారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో ఉధృతంగా కొనసాగుతున్న కాపు సమస్యల ఉద్యమాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.ఎవరికి అన్యాయం జరిగి నా తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, పాలకులనైనా నిలదీస్తుందని ఎన్నికల ముందు సినిమా డైలాగులు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు వాటిని విస్మరించారన్నారు.
కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని అమలు చేయకుండా మోసగిస్తున్నారని సీఎంపై మండిపడ్డారు. గతంలో సీఎంగా కొనసాగినప్పుడే కమిషన్ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోని కారణంగా బాబు పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందన్నారు. ఏ ప్రాంతంలో కాపు సమస్యల ఉద్యమాలు వస్తే ఆ ప్రాంత నేతలు, మంత్రులతో ప్రకటనలు చేయిం చినంత మాత్రాన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సీమలోని కాపులకు సరైన గుర్తింపునివ్వకుండా మభ్యపెట్టాలని చూస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెపుతారన్నారు.