రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకోచ్చి అంతరాయంలో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో అర్చన, అష్టోత్తర శతనామార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన సింహాసనంపై వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ గావించి, స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవోపేతంగా రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. శని, ఆదివారం వరుస సెలవు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భద్రాచలం వచ్చారు. ఉదయం పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలై¯ŒSలో బారులు తీరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.