ఇద్దరు బాలికల గృహనిర్బంధం.. రేప్
సాక్షి హన్మకొండ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి ఇద్దరు బాలికలు పారిపోయి వరంగల్ జిల్లాకు వచ్చారు. రైల్వేస్టేషన్‌లో దిగిన వారిపై కామాంధుల కళ్లుపడ్డాయి. మూడు రోజులు గృహ నిర్బంధంలో ఉంచి నలుగురు తమ కామవాంఛ తీర్చుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు మంగళవారం హాస్టల్ నుంచి పారిపోయివచ్చినట్లు తెలుస్తోంది. వీరు అదే రోజు సాయంత్రం సమయంలో వరంగల్ రైల్వేస్టేష న్లో ఉండగా, గమనించిన విశ్వనాథ్, సతీష్ అనే చిల్లర వ్యాపారులు వారితో మాటలు కలిపారు. తమవెంట వస్తే భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి పంపుతామని నమ్మబలికారు. దీంతో వారిని నమ్మి వెళ్లారు. ఆ రాత్రి విశ్వనాథ్, సతీష్‌లు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయం మొత్తం రాత్రి నుంచి గమనించిన నజీర్, రాజేష్‌లు బాలికల విషయంలో విశ్వనాథ్, సతీష్‌లను నిలదీశారు. దీంతో వారికి అసలు విషయం చెప్పారు. బాలికలను తమకు అప్పగించాలని నజీర్, రాజేష్‌లు బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరు అమ్మాయిలను వారికి అప్పగించారు. వారు బాలికలను మరో ఇంట్లో బంధించి గురు, శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, ఇద్దరు బాలికల్లో ఒకరు శుక్రవారం తప్పించుకుని రైల్లో విజయవాడ పారిపోయింది.
అక్కడ, ఆమెను చైల్డ్‌లైన్‌వారు చేరదీయగా, విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి చైల్డ్‌లైన్ సిబ్బంది వరంగల్‌కు చేరుకుని బాలిక చెప్పిన వివరాలు ప్రకారం ఆరా తీశారు. బాలికలను మొదట తీసుకెళ్లిన ఇద్దరిలో ఒకడైన సతీష్ దొరికాడు. కాగా, అతని ద్వారా రెండో బాలిక కోసం ఆరాతీస్తున్నారు. శనివారం రాత్రి వరకూ సదరు బాలిక ఆచూకీ లభించలేదు. అయితే బాకలిను వదిలేశారా... లేక విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఇంకేమైనా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి. కాగా, బాధిత బాలికల బంధువులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు జిల్లా సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అనితారెడ్డిని కలసి విషయం తెలిపారు.