- నిందితుడిపై కాలనీవాసుల ఆగ్రహం
- కాలనీలో పోలీసు పికెట్
లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
Published Thu, Sep 29 2016 9:31 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
అమలాపురం టౌన్ :
అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన మైనర్ మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి చేసి పరారైన అదే కాలనీకి చెందిన కొప్పనాతి సతీష్‌ను పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. డీఎస్పీ లంక అంకయ్య పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడు సతీష్‌ను ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. అచేతనంగా ఉండే ఆ మానసిక వికలాంగ బాలికపై 23 ఏళ్ల సతీష్ ఈనెల 27వ తేదీ తెల్లవారు జామున లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈదరపల్లి వంతెన వద్ద సతీష్‌ను ఉదయం అరెస్ట్ చేశామన్నారు. బాధిత బాలికను మరింత మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలిపారు.
ఆ దుర్మార్గుడిని మాకు అప్పగించండి
కాగా నిందితుడు సతీష్‌ను తమకు అప్పగించాలంటూ మున్సిపల్ కాలనీవాసులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి కాలనీవాసులు బుధవారం రాత్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఒక దశలో లాఠీలకు పనిచెప్పారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి, సతీష్‌తో పాటు అతని కుటుంబీకులకు పోలీసులు రక్షణ కల్పించారు.
Advertisement
Advertisement