పెళ్లి మాటెత్తితే మొహం చాటేశాడు
►గర్భం దాల్చిన యువతి
►నిందితుడిపై కేసు నమోదు
గాజువాక: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడొక యువకుడు. ఆమె గర్భం దాల్చడంతో తనకు సంబంధం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని అటు పోలీసుల చుట్టూ, ఇటు పెద్దల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. ఆమెకు న్యాయం చేయాలని తమ ప్రతినిధులతో కలిసి పద్మ గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ఆందోళకు దిగారు. దీనిపై స్పందించిన పోలీసులు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితురాలు, గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తుంగ్లాం గ్రామానికి చెందిన కోన స్వప్నతో ఆమె బంధువు గొలగాని శ్రీనివాస్‌కు వివాహం చేయాలని పెద్దలు ప్రతిపాదన చేశారు. పెళ్లి మాటలు కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 20న శ్రీనివాస్ ఆమె ఇంటికి వెళ్లాడు. తన తల్లిదండ్రులు పనికి వెళ్లిపోయారని ఆమె చెప్పినప్పటికీ ఇంట్లోకి ప్రవేశించాడు. కొద్ది సేపు మాటల తరువాత తాను పెళ్లి చేసుకుంటానంటూ స్వప్న చేయి పట్టుకున్నాడు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. పెళ్లి చేసుకోవాలనుకున్న తరువాత భయమెందుకంటూ శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం వెళ్తూ తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, కనుక నిన్ను పెళ్లి చేసుకోలేనని స్వప్నకు షాకిచ్చాడు.
మరుసటి నెలలోనే ఆమెకు గర్భం ఖాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ అమ్మానాన్నలకు విషయాన్ని తెలిపారు. తమ కుమార్తెను శ్రీనివాస్‌తో వివాహం జరిపించాలని ప్రాధేయపడ్డారు. అందుకు అతని తల్లిదండ్రులు ససేమిరా అనడంతో తొలుత గాజువాక పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని పిలిచి మాట్లాడతామని చెప్పారు. రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో గ్రామంలోని, గాజువాకలోని కొంతమంది పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు మాట్లాడటంతో తొలుత యువతికి గర్భస్రావం చేయించాలని కోరారు.
ఆస్పత్రికి వెళ్లిన అనంతరం అబార్షన్‌కు డాక్టర్ అంగీకరించకపోగా కేసు పెడతానని హెచ్చరించి పంపించేశారు. పెళ్లికి అంగీకరించబోమంటూ నిందితుడి తల్లిదండ్రులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేయడంతో బాధితురాలు మహిళా చేతన ప్రతినిధులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ వద్ద సంస్థ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సీఐ ఇమ్మానుయేలురాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.