పోలీసుల అదుపులో లైంగికదాడి నిందితుడు !
Published Mon, Jul 25 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
తణుకు : పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సజ్జాపురంలోని నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన మంగం విజయకుమార్ గత పదిహేను రోజులుగా లైంగిక దాడి చేస్తున్న విషయం తెలిసిందే. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లి నిలదీయడంతో ఆదివారం విషయం బయటపడింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జి ఎస్సై బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేయగా విచారణ నిమిత్తం కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు సోమవారం తణుకు వచ్చారు. సజ్జాపురం ప్రాంతంలోని సొసైటీ వెనుక ఒక అపార్టుమెంటులో బాలిక తల్లిదండ్రులు పని చేస్తున్నారు. బాలికను ఆదివారం ఉదయం తల్లి లేని సమయంలో తన ఇంటింకి తీసుకెళ్లి విజయ్‌కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇదే తరహాలో లైంగికదాడి చేశాడు. విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను భయపెట్టాడు. దీంతో బాలిక ఇంతకాలం ఎవరికీ చెప్పలేదు. అయితే ఆదివారం ఆమెకు రక్తస్రావం కావడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడు విజయకుమార్ రెండు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి తాపీ పనులు చేసుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలికకు తణుకు ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Advertisement
Advertisement