జిల్లా స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం
♦ నేటి నుంచి భూ విలువల పెంపునకు ప్రభుత్వ ఆదేశాలు
♦ జిల్లా వాసులపై రూ. 30 కోట్ల రూపాయల భారం
విజయనగరం రూరల్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి పట్టణ, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో భూములు, భవనాలు, కట్టడాలకు సంబంధించి మార్కెట్ విలువ భారీగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అధికాదాయం పొందడానికి స్థిరాస్తుల ధరలపై 20 నుంచి 30 శాతం పెంచడానికి చర్యలు చేపడుతోంది. మార్కెట్ విలువల సవరణ ద్వారా జిల్లా వాసులపై 25 కోట్ల రూపాయల భారం పడనుంది. భూముల విలువల పెంపుపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.
ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బి. లఠ్కర్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరలపై కమిటీ సూచించిన అంశాల ఆధారంగా భూముల ధరలు పెంచనున్నారు. గతేడాది ఆగస్టు ఒకటో తేదీన భూముల ధరలకు సంబంధించి సవరణలు చేశారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని «భూములు, భవనాల ధరలకు రెక్కలు రానున్నాయి. వీటి పరిధిలో ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో స్థిరాస్తులకు మార్కెట్ సవరణ చేయడం ద్వారా ప్రభుత్వానికి సుమారు 30 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా రానుంది.
రూ. 275.44 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యం
జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం 2016– 17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 275.44 కోట్ల రూపాయల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. 2015– 16 సంవత్సరంలో 148 కోట్ల రూపాయల లక్ష్యాన్ని రిజిస్ట్రేషన్ శాఖకు కేటాయించగా 174.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ఉత్తర్వులు అందాయి.
పట్టణ, మున్సిపాలిటీల పరిధిలో మార్కెట్ విలువల సవరణపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. ఆదివారం సాయంత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో స్థిరాస్తుల సవరణ కమిటీ సమావేశమైంది. ఆగస్టు ఒకటి నుంచి సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి.
– ఎం.శ్రీనివాసమూర్తి, జిల్లా రిజిస్ట్రార్, విజయనగరం