కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
Published Sun, Aug 27 2017 9:30 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
– గెలిచిన వారు ఊరేగింపులు నిర్వహించరాదు
– జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమై ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ఓట్లు లెక్కింపు కేంద్రం సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుందని, ఇందులోనే మీడియా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.
రౌండు వారీగా ఫలితాలు తెలుసుకునేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నంద్యాలలో 144వ సెక‌్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గెలిచిన వారు ఎటువంటి ఊరేగింపులు చేపట్టకుండా నిషేధం విధించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని, అంతకు ముందుగా కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా టేబుళ్లకు కేటాయిస్తామని తెలిపారు. కౌంటింగ్‌కు 14 టేబుళ్లు వినియోగిస్తున్నామని, 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు.
Advertisement
Advertisement