చీటర్‌ టు స్మగ్లర్‌ | real cheater | Sakshi
Sakshi News home page

చీటర్‌ టు స్మగ్లర్‌

Published Wed, Jul 20 2016 8:56 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

చీటర్‌ టు స్మగ్లర్‌

చీటర్‌ టు స్మగ్లర్‌

ఇరవై ఏళ్ళ కిందట అతనో జర్నలిస్టు. ఆ తర్వాత రియల్టర్‌ అవతారం. రియల్‌ వ్యాపారంలో మోసాలు.. సామాజిక పరపతితో రాజకీయ, అధికార పార్టీ నేతలతో పరిచయాలు...వీటిని అడ్డుపెట్టుకుని విజయవాడలో అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఒక్కొక్కదాన్ని ముగ్గురు నలుగురికి విక్రయిస్తూ  రూ. వంద కోట్ల వరకు అక్రమార్జన. మోసాలు బయటపడడంతో తాను చనిపోయినట్లు చిత్రీకరించుకునే యత్నం.. చివరకు ప్లాట్ల కొనుగోలుదారులు అతడి చిరునామాను గుర్తించి పోలీసులకు తెలియజేయడంతో అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.  కట్‌ చేస్తే...

 
సాక్షి, విజయవాడ : రియల్‌ చీటర్‌ తన స్వరూపం మార్చుకొని గంజాయి స్మగ్లర్‌గా రూపాంతరం చెందాడు.  రాష్ట్ర రాజధానితో పాటు దేశ రాజధానిలోని పోలీస్‌ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఏడాది కాలంలో సుమారు రూ.10 కోట్ల విలువ చేసే గంజాయిని విక్రయించాడు.  తాజాగా ఇతడిపై కేసులు నేపథ్యంలో సోమవారం భారీ హైడ్రామా నడుమ కోర్టు ముందు హాజరుపర్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదీ చీటర్‌ నుంచి స్మగ్లర్‌గా మారిన నార్ల వంశీకృష్ణ బాగోతం. నేడు పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వంశీకృష్ణ 2006 నుంచి రియల్‌ వ్యాపారం చేసి రూ. కోట్లు గడించాడు. విజయవాడ నగరం సత్యనారాయణపురంతో పాటు పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాటు కొనుగోలు చేసి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరికి విక్రయించేవాడు.  ఇలా విజయవాడ కమిషనరేట్‌లోని కృష్ణలంక, గవర్నర్‌పేట, మాచవరం, సూర్యారావుపేట, పటమట, వన్‌టౌన్‌తోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌ స్టేషన్లలో 13 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. 2011లో తెనాలి సమీపంలోని బకింగ్‌హాం కాలువలో తన కారును తోసి తాను ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించుకునే యత్నం చేశాడు. కొంతకాలం అజ్ఞాతంలో ఉండడంతో ఇది నిజమని బాధితులు నమ్మారు.  చివరకు అతడు బతికేఉన్నాడని తెలుసుకుని 2013లో కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడిని అరెస్ట్‌ చేశారు. కృష్ణలంక స్టేషన్‌లో నమోదయిన కేసులో కేసు రుజువు కావటంతో ఆరు నెలలు శిక్ష పడింది. 
 
జైలులో స్మగ్లర్లతో పరిచయాలు..
వంశీకృష్ణ జైలులో ఉండగా అంతర జిల్లాల గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి విడుదలైన వంశీకృష్ణ చాలాకాలం అజ్ఞాతంలోనే ఉన్నాడు. 2015  ఆక్టోబర్‌ నుంచి స్మగ్లర్‌ అవతారం ఎత్తాడు.  విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గంజాయి సాగుదారులతో నేరుగా మాట్లాడుకొని అమ్మకాలు మొదలుపెట్టాడు.  చింతపల్లిలో కొనుగోలు చేసి విజయవాడ, తర్పూగోదావరి, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయాలు సాగించాడు. ఏడాదిలో రూ.8 నుంచి 10 కోట్లు విలువ చేసే గంజాయిని విక్రయించాడు. 2015లో ఇతనిపై గంజాయి కేసులు మొదలయ్యాయి. ఢిల్లీలోని వసంత్‌విహార్‌ స్టేషన్‌లో వెయ్యి కిలోల గంజాయి కేసు, ఈ ఏడాది జనవరి 22న కొండపల్లిలో మూడు వేల కిలోల గంజాయి కేసు, మార్చి 27న తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిలో వెయ్యి కిలోల కేసు, విజయవాడ పటమట పోలీస్‌ స్టేషన్‌ పరి«ధిలోని భారతీ నగర్‌లో 600 కిలోల కేసు, మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో 150 కిలోల కేసు, ఇబ్రహీంపట్నంలో 3,200 కిలోల కేసులు మొత్తం కలిపి ఆరు ఉన్నాయి.
 
అదుపులోకి తీసుకున్న పోలీసులు...
వంశీకృష్ణ కోసం రెండు నెలల కిందట ఢిల్లీ నుంచి నార్కోటిక్స్‌ బృందం విచారణ కోసం విజయవాడ రావడంతో   పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వంశీకృష్ణ తల్లి కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ వేయడంతో నేరుగా న్యాయస్థానం ఎదుట సోమవారం ఉదయం న్యాయవాదులు హాజరుపరిచారు. వాస్తవానికి నాలుగో ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా పోలీసుల ఒత్తిడి ఎక్కువగా ఉందని న్యాయవాదులు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ఎదుట రెండు కేసుల్లో హాజరుపరిచారు. మిగిలిన కేసులు నిమిత్తం 29న నాలుగో ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ, తూర్పుగోదావరి జిల్లాల కేసుల్లో అరెస్ట్‌ కావాల్సి ఉంది.  
 
గంజాయి కేసులో నార్ల వంశీకృష్ణకు రిమాండ్‌
విజయవాడ లీగల్‌ :  గంజాయి  కలిగిఉన్న  కేసులో నిందితుడు నార్ల వంశీకృష్ణకు ఈ నెల 29 వరకు రిమాండ్‌ విధిస్తూ  నగర మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఆర్‌.నిరంజన్‌  సోమవారం  ఉత్తర్వులు జారీ చేశారు. వంశీకృష్ణ రియల ఎస్టేట్‌ వ్యాపారం  చేసి  ఒకే ప్లాటును ఇద్దరికి రిజిస్ట్రేషన్‌  చేసి దాదాపు రూ. 100 కోట్ల మేర చీటింగ్‌  చేశాడు. దానికి సంబంధించి వంశీకృష్ణపై నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వంశీ తాను చనిపోయినట్లు ప్రజలను నమ్మించేందుకు  తెనాలి వద్ద  కారు ప్రమాదం సృష్టించాడు.  ఆ తర్వాత  వైజాగ్‌ వద్ద అడవులలో గంజాయి వ్యాపారం  మొదలు పెట్టాడు. దాదాపు  20 టన్నుల గంజాయిని వివిధ రాష్ట్రాలకు  చేరవేశాడు. ఈ నెల 16న ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.  
 
అక్రమంగా బంధించారు
తన కుమారుడు  ఏ నేరం చేయలేదని పోలీసులు  అన్యాయంగా అరెస్టు చేసి  అన్ని గంజాయి కేసులు ఒప్పుకోమని వేధింపులకు గురిచేశారని వంశీ తల్లి కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ తన న్యాయవాది ద్వారా    దాఖలు చేశారు. దాన్ని విచారించిన న్యాయమూర్తి అడ్వకేట్‌ కమిషనర్‌గా న్యాయవాది  కె.శ్రీకాంత్‌ను నియమించారు. విచారించగా ఎన్‌.టి.టి.పి.ఎస్‌. గెస్ట్‌హౌస్‌ రూం నంబరు 36 వంశీ ఉన్నట్లు గుర్తించారు.  కోర్టులో హాజరుపరచకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఎం.ఎస్‌.జె.కోర్టులో నిందితుడు సరెండర్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుని  లొంగిపోయాడు. న్యాయమూర్తి ఈ నెల 29 వరకు రిమాండ్‌ విధించినట్లు  వంశీ న్యాయవాది కిలారు బెనర్జీ తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement