సాక్షి, సిటీబ్యూరో : భూమిపై పెట్టుబడి పెట్టండి.. నెలవారీ ఆదాయాలు పొందండి అంటూ వివిధ రకాల ఆకర్షణీయ స్కీమ్‌లతో దాదాపు 1,450 మందిని.156 కోట్ల రూపాయల మేరకు మోసగించిన కేసులో స్వధాత్రి ఇన్‌ఫ్రా లిమిటెడ్ ప్రతినిధులు రఘు యార్లగడ్డ, గొగులపాటి శ్రీనివాసబాబు, మేనేజర్ మీనాక్షిలను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్స్, ఐపీసీ 420, 406, 506 సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు తెలిపారు.
ఎంసీఏ చదివాడు...దారి తప్పాడు
1999లో ఎంసీఏ పూర్తిచేసిన రఘు 2008–09 సమయంలో ఐబీఎం కంపెనీలో సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పనిచేశాడు. 2010–11 మధ్యలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత విజయవాడలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా, మరోవైపు భారీ వడ్డీలకు డైలీ ఫెనాన్స్ వ్యాపారం చేశాడు. ఈ సమయంలో పోలీసు స్టేషన్‌లలో కొన్ని కేసులు నమోదవడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటికే తనకు పరిచయమున్న శ్రీనివాసబాబుతో కలిసి 2017లో స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్, స్వధాత్రి రియల్టర్స్ పేర్లతో మూడు సంస్థలను ప్రారంభించాడు. 2017లో శ్రీనగర్ కాలనీలో ఒక కార్యాలయాన్ని, 2019 అక్టోబర్‌లో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ద్వారక సిగ్నేచర్‌లో మరో కార్యాలయాన్ని ప్రారంభించాడు. కస్టమర్లను ఆకట్టుకొని డబ్బులు గుంజేయాలన్న ఆలోచనతో మూడు స్కీమ్‌లను తెరపైకి తెచ్చాడు.
భారీ హంగులు...
అయ్యప్ప సొసైటీలోని ద్వారాక సిగ్నచర్‌లోని కార్యాలయాన్ని సకలహంగులతో తీర్చిదిద్దాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏకంగా 30 మంది మార్కెటింగ్ ఏజెంట్లు, 20 మంది టెలీకాలర్లను నియమించాడు. భూమిపై పెట్టుబడి పెట్టండి...లాభాలు పొందండి అంటూ వారితో కస్టమర్లను నమ్మించడం మొదలెట్టాడు. ఆఫీసుకు వచ్చే వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు బెంజ్, ఫార్చునర్ కార్లతో సహా ఏకంగా 20 వాహనాలను అద్దెకు తీసుకొని ఆఫీసు ప్రాంగణంలో పార్క్ చేసేవాడు. ఈ హంగు అర్భాటలను చూసి వందలమంది డబ్బులు డిపాజిట్ చేశారు.
కట్టిపడేసే స్కీమ్‌లు ఇలా...
కనీసం రూ.లక్షకుపైగా డిపాజిట్ చేస్తే ప్రతినెలా ఏడాది పాటు తొమ్మిది శాతం లాభాలు... ఓపెన్ ప్లాట్లకు ఒకేసారి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది పాటు ప్రతి నెల నాలుగు నుంచి పది శాతం చెల్లింపులు చేస్తామని నమ్మించాడు. అపార్ట్‌మెంట్‌లలోని ఫ్లాట్లకు ఒకేసారి 60 శాతం డబ్బులు చెల్లించి బుక్ చేసుకుంటే అందులోకి కస్టమర్ వచ్చేవరకు ప్రతినెల రూ.పదివేలు చెల్లిస్తామంటూ...ఇలా మూడు స్కీమ్‌లతో కస్టమర్లను ఆకర్షించారు. షాద్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్లు బుక్ చేసుకొని కొంత మంది కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేశారు.
అయితే తర్వాత ఇస్తామన్న లాభాలు ప్రతినెలా చెల్లించలేదు. ఫ్లాట్ల విషయంలోనూ 60 శాతం డబ్బులు వసూలు చేసి ప్రతినెలా ఇస్తామన్న రూ.పదివేలు ఇవ్వలేదు. ఫ్లాట్లు కూడా చేతికి ఇవ్వలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిపి ఫిర్యాదుచేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు కేసును ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్‌కు అప్పగించడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీరిని పోలీసు కస్టడీకి తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఈవోడబ్ల్యూ అడిషనల్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment