
మూతపడిన డాక్యుమెంటేషన్, రియల్ వ్యాపారుల కార్యాలయాలు
యాచారం: రియల్ వ్యాపారానికి ‘పెద్ద’ షాక్ తగిలింది. ప్లాట్ల ధరలు నెల క్రితంతో పోలిస్తే 30 శాతానికి పైగా పడిపోయాయి. స్థానికంగా ఫార్మాసిటీ ఏర్పాటు కావడం.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తున్న మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేశారు.
దీనికోసం రూ.కోట్లలో ఖర్చు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాచారం, మాల్ కేంద్రాల్లోని ప్లాట్లు రోజుకు 50 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్ చేసేవారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో నాలుగు రోజులుగా పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలూ మూత పడ్డాయి.
పడిపోయిన ధరలు
యాచారం, మాల్ కేంద్రాల్లో 60కి పైగా వెంచర్లను ఏర్పాటు చేశారు. యాచారంలో గజం ధర రూ. 2 వేల నుంచి రూ.10 వేలకు పైగా ఉండగా... మాల్‌లో గజం ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. యాచారం, మాల్, నందివనపర్తి, గునుగల్, తక్కళ్లపల్లి, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో వందలాది ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు భారీగా అడ్వాన్స్ లు ఇచ్చారు.
పెద్ద నోట్ల రద్దు.. భవిష్యత్తులో ధరలు మరింత పతనమవుతాయనే బెంగతో వ్యాపారులు అడ్వాన్సులు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అటు నుంచి స్పందన ఉండడం లేదు. యాచారం, మాల్ కేంద్రాల్లోనే ప్రజలు రూ.15 కోట్లకు పైగా అడ్వాన్స్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్న వారు పెద్ద నోట్లు ఇస్తామని చెబుతుండడంతో వ్యాపారులు కంగుతింటున్నారు.