సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో కచ్చితంగా తెలుసుకునేందుకు ఆ శాఖలోని వివిధ విభాగాల అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఉద్యోగ ఖాళీల వివరాలు ఇస్తే సీఎం ఆమోదం తీసుకొని నియామకాలకు అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఆదేశించిన వెనువెంటనే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అదే పనిలో నిమగ్నమయ్యారు. కుటుంబ ఆరోగ్య సంక్షే మం, వైద్య విద్య, నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెం టివ్ మెడిసిన్ (ఐపీఎం), టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, డ్రగ్స్ సహా వివిధ చోట్ల ఖాళీలపై ఆయా విభాగాల అధిపతులు ఇప్పటికే తుది అంచనాకు వచ్చినట్లు తెలిసింది. తమ శాఖలో ఖాళీల వివరాలతో సోమవారం సీఎస్‌కు నివేదిక ఇస్తామని రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు.
అన్నీ శాశ్వత ప్రాతిపదిక కిందే...
వైద్య శాఖలో భారీగా ఖాళీలున్నాయి. గతంలో సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం... నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు, అక్కడే 158 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ ఖాళీలున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, 205 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా ఖాళీలున్నాయి.
అయితే ఇటీవల రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా 1,330 పోస్టుల భర్తీని కాంట్రాక్టు పద్దతిలో చేపట్టారు. 391 ఆయుష్ పోస్టుల భర్తీకి కూడా సర్కారు ఆమోదం తెలిపింది. అవి పోను మిగిలిన ఖాళీల వివరాలు అందజేశాక నియామకంపై ప్రభుత్వం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. భర్తీ చేయబోయే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాలన్నీ శాశ్వత ప్రాతిపదిక కిందే నియమిస్తారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 3 వేలకు పైనే పోస్టుల భర్తీ చేపట్టే అవకాశాలున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇంటర్వ్యూలుండవు.. ప్రతిభ ఆధారంగానే భర్తీ
వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఖాళీలను ఎలా భర్తీ చేయాలన్న దానిపై వైద్యాధికారులు మేధోమధనం చేస్తున్నారు. నియామక మండలి ఏర్పాటు చేసి భర్తీ చేయాలని గతంలో అనుకున్నా అది సుదీర్ఘ ప్రక్రియ అని భావించి ఆ ఆలోచనను పక్కనపెట్టారు. వైద్య నిపుణులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు. ఇంటర్వ్యూల జోలికి పోకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని యోచిస్తున్నారు.
వైద్య శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు
Published Sun, Nov 29 2015 2:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement