మాట్లాడుతున్న రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి
వనపర్తిటౌన్: పాలమూరు యూనివర్సిటీలో 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపామని పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 21 డిగ్రీ కళాశాల్లో అత్యధికంగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నాలుగు చోట్ల మాత్రమే రెగ్యూలర్ ప్రిన్సిపాల్ ఉన్నారని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం అభినందనీయమన్నారు. ఆన్‌లైన్ విధానంతో రూ. 100 రుసుముతో రాష్ట్రంలో ఏ కాలేజీల్లోనైనా ప్రవేశానికి విద్యార్థులకు అవకాశం లభించిందన్నారు.
గతంలో ఇతర జిల్లాల్లోని కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు నానా తంటాలు పడేవారని చెప్పారు. చాలా మటుకు విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు తెలియకపోవడంతో వారికి మరో అవకాశకంగా ఈ నెల 25 నుంచి 30 వరకు ఛాన్స్ ఇచ్చిందన్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాల్లో 21341 సీట్లు ఉన్నాయని, ఆన్‌లైన్‌లో 13 వేల వరకు నమోదు అయ్యావని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28, 29 తేదీల్లో పీయూలో జరగనుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, వీరయ్య, జ్యోతి ఉన్నారు.