అంతా గీకుడేనట..!
సాక్షి ప్రతినిధి, కడప: పెద్ద నోట్ల రద్దు.. కొత్త నోట్లు ఇంకా పూర్తిగా చెలామణిలోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర నోట్ల సమస్యతో జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిపై మరో భారం మోపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు, నగదు విత్ డ్రాపై ఆంక్షలతో ఇప్పటికే అసహనంతో ఉన్న చిరు వ్యాపారులకు పీఓఎస్ మిషన్లు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఆర్థిక లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్ల ద్వారానే జరగాలని సూచిస్తున్నారు. కిళ్లీ బడ్డీలు, కూరగాయల వ్యాపారులు, పచారీ దుకాణాలు, సినిమా థియేటర్లలో వ్యాపారులందరికీ పీఓఎస్ మిషన్లు సరఫరా చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ తరహా లావాదేవీలు ఇప్పటికిప్పుడు నిర్వహించడం అసాధ్యమేనని పలువురు పేర్కొంటున్నారు. అత్యధిక శాతం నిరక్షరాస్యులు ఉన్న మన రాష్ట్రంలో క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించుకోవడం అనేది విద్యావంతులకే ఇప్పటికీ తెలియదు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన నగదు రహిత లావాదేవీలు నిర్వహణ అనేది అంత తేలికైన విషయం కాదన్నది అత్యధికుల వాదన.
గ్రామీణ ప్రాంతాల్లో బహు కష్టం..
గ్రామీణ ప్రాంతాల్లో అన్ని లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించడం ఇప్పుడిప్పుడే వీలుకాదని అధికారులు చెబుతున్నారు. పల్లెల్లో దీనిపై ఇంకా అవగాహన లేదని, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గ్రామీణుల్లో చాలా మందికి సెల్‌ఫోన్ వినియోగించడమే సరిగ్గా చేతకాదని మరికొందరంటున్నారు. జిల్లాలో మొత్తం జనాభాలో 32.70 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారిలో చాలా మందికి బ్యాంకు ఖాతాలే లేనట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ ఖాతాలు ఎప్పుడు తెరుస్తారు, వారికి స్వైపింగ్ పరిజ్ఞానం అర్థం కాకుంటే ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఏమిటీ అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎం కార్డులు విరివిగా ఉపయోగించడం వల్లే ఎక్కువగా ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలన్నీ పీఓఎస్ మిషన్ల ద్వారా అంటే మరిన్ని మోసాలు జరిగే అవకాశం లేకపోలేదు.
క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం ఎంత..?
బ్యాంకు ఖాతాదారుల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు కలిగిన వారు 25 శాతం మంది ఉంటారని అంచనా. వీటిని జారీ చేసే క్రమంలో ఆయా బ్యాంకులు కొన్ని ప్రత్యేక విధి విధానాలను అమలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే ఈ కార్డుల జారీ, వాడకం పెరిగిపోయింది. అయితే వీటిని వినియోగించడంపై చాలా మందికి అవగాహన లేదు. చిన్న వ్యాపారులు, చదువురాని వారికి అసలే లేదు. ఈ విధానంపై అవగాహన కల్పించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
ఎంత మందికి తెలుసు..?
ఇప్పటి వరకూ అతి కొద్ది మంది మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరు ఎంత మంది ఉంటారనే దానికి కచ్చితమైన గణాంకాలు లేవు. జిల్లాలో 28,82,469 మంది జనాభా ఉంటే వారిలో నెట్ బ్యాంకింగ్ నిర్వహించే వారు రెండు, మూడు లక్షలకు మించి ఉండరని కొందరు బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. అది కూడా మనీ ట్రాన్స్‌ఫర్ కోసం, విమానం, రైలు, ఆర్టీసీ టికెట్ల బుకింగ్, పెద్ద మాల్స్, సినిమా థియేటర్ల కొనుగోలుకు మాత్రమే పరిమితం అంటున్నారు. ఈ విధానం కూడా బ్యాంక్ అకౌంట్లను కచ్చితంగా ఎక్కువ మొత్తంలో నిర్వహించే వారికి, నెట్ బ్యాంకింగ్ గూర్చి తెలిసిన వారికే సాధ్యమని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానాన్ని వినియోగించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.