త్వరలో ఎర్రబంగారం విక్రయం?
జిల్లాలో నిల్వ ఉన్న 995 మెట్రిక్ టన్నుల దుంగలు
అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ సుమారు రూ.250 కోట్లు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అటవీశాఖాధికారులు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరించేందుకు ఎర్రచందనం నిల్వలను వేలం వేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించింది. దీంతో నెల్లూరు జిల్లా అటవీశాఖ పరిధిలో స్వాధీనం చేసుకున్న దుంగలను ఆశాఖ అధికారులు భద్రపర్చారు. వాటిలో కొన్నింటిని అప్పట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్‌లైన్ టెండర్లు ద్వారా విక్రయించారు.
నెల్లూరు(బారకాసు) : జిల్లాలో నిల్వ ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు అటవీశాఖాధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ శాఖ అధికారులు నిల్వ వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో వెంకటగిరి, ఆదురుపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఎర్రచందనం వక్షాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న దుంగలను జిల్లా అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకుని సంబంధిత కార్యాలయాల్లో భద్రపరిచారు. ఈవిధంగా స్వాధీనం చేసుకున్న దుంగలు 995 మెట్రిక్ Sటన్నులున్నాయి. అంతార్జతీయ మార్కెట్‌లో వాటి విలువ సుమారు రూ.250 కోట్లు పలుకుతోంది. కాగా దుంగలతోనే కాకుండా వాహనాల ద్వారా కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. రెండేళ్ల క్రితం పట్టుబడ్డవాటిలో వంద వాహనాలు విక్రయించగా ఆశాఖ ఆధీనంలో ఇంకా 300 వాహనాలు ఇంకా ఉన్నాయి. వీటిని వేలం వేస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం అధికారులు కోర్టు కేసులు, ఉన్నతాధికారుల ఆదేశాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.
ఆగని అక్రమ రవాణా..
పోలీసులు, అటవీశాఖ అధికారులు స్మగర్లను అరెస్టు చేసి దుంగలను స్వాధీనం చేసుకుంటున్నా అక్రమరవాణా మాత్రం కొనుసాగుతూనే ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతోంది. జిల్లాలో ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో ఫారెస్ట్ రేంజ్‌లున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల కొందరు స్మగ్లర్లు వక్షాలను నరికి దుంగలుగా మార్చి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అధికారులు దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వం ఆదేశిస్తే విక్రయిస్తాం : డాక్టర్ పీఎస్ రాఘవయ్య, డీఎఫ్‌ఓ నెల్లూరు.
జిల్లాలో మొత్తం 995 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. వాటిని విక్రయించేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అనుమతి రాగానే ఆన్‌లైన్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం.