జమ్మలమడుగురూరల్: ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు ఎర్ర కూలీలను అదుపులోకి తీసుకొని వారివద్దనుంచి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక అర్బన్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఉదయం ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి స్కార్పియో వాహనాన్ని ఆపాలని కోరగా డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని తీసుకెళ్లాడు. దీంతో అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నామన్నారు. ఆ వాహనంలో 5 ఎర్రచందనం దుంగలు, 8 మంది వ్యక్తులు ఉన్నారన్నారు. అయితే వారిలో ఆరుగురు పారిపోగా నారాయణ, వీరభద్రయ్య అనే వ్యక్తులు మాత్రమే దొరినట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా రెండు వాహనాలు వీరభద్రయ్యకు చెందినవిగా తెలిసిందన్నారు. ఈ దుంగల విలువ రూ.ఐదు లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాగరాజు, ఏఎస్‌ఐ మురళీ, హెడ్‌కానిస్టేబుల్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.