ధర తగ్గి.. బతుకు బుగ్గి! | reduced price .. everyone! | Sakshi
Sakshi News home page

ధర తగ్గి.. బతుకు బుగ్గి!

Published Fri, Aug 26 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ధర తగ్గి.. బతుకు బుగ్గి!

ధర తగ్గి.. బతుకు బుగ్గి!

టమాట ధర పతనం
– ముందస్తు వర్షాలతో భారీగా పెరిగిన సాగు
– ఒకేసారి మార్కెట్‌లోకి దిగుబడులు
– ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
– 28 కిలోల బాక్కు ధర హోల్‌సేల్‌గా రూ.30
– రవాణా చార్జీలు, కూలి ఖర్చులకూ గిట్టని వైనం
– పొలంలోనే వదిలేస్తున్న రైతులు
– మార్కెటింగ్‌ శాఖ చర్యలు శూన్యం


కర్నూలు(అగ్రికల్చర్‌):
రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత టమాట అత్యధికంగా సాగయ్యే జిల్లా కర్నూలు. ఖరీఫ్‌లో జిల్లా సాధారణ సాగు 6,500 హెక్టార్లు ఉండగా.. దాదాపు 6,800 హెక్టార్లలో సాగయింది. అయితే జిల్లాలో టమాట ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా అమలుకు నోచుకోని పరిస్థితి. ఫలితంగా యేటా టమాట ధర పడిపోతుండటంతో రైతుల శ్రమ మట్టిలో కలుస్తోంది. కనీసం రైతులను గట్టెక్కించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేకపోతోంది. ఏటా టమాట ధర జనవరి, ఫిబ్రవరి నెలల్లో పడిపోతుంటుంది. ఈసారి ముందస్తుగానే ఆ పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనేపథ్యంలో మార్కెటింగ్‌ శాఖ రంగంలోకి దిగి టమాట దిగుబడులను సేకరించి ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తరలించి విక్రయించే ఏర్పాటు చేయాలి. అయితే ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. జిల్లాతో పాటు చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లోనూ టమాట సాగు పెరగడం, దిగుబడులు ఒకేసారి రావడంతో ధర పతమయినట్లు తెలుస్తోంది.

ముందస్తు వర్షాలతోనే..
ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తుగా.. అంటే జూన్‌లోనే వర్షాలు కురవడంతో టమాట సాగు మొదలయింది. జూలై నెల చివరి వరకు వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు మార్కెట్‌కు చేరడం ప్రారంభమయింది. సరిగ్గా 45 రోజుల క్రితం కిలో టమాట ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. ఊహించని విధంగా సాగు పెరగడం, అన్ని ప్రాంతాల్లో పంట ఒకేసారి రావడంతో ధర పతనమయింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌లో 28 కిలోల బాక్స్‌ ధర రూ.30 నుంచి రూ.60 మాత్రమే పలుకుతోంది. అంటే కిలో ధర రూ.1 నుంచి రూ.2లు మాత్రమే. కొద్ది రోజులుగా ధరలు ఇదే స్థాయిలో ఉండటంతో రైతులకు పెట్టుబడులు కాదు గదా.. టమాటను తెంపడానికి, రవాణా చార్జీలకూ సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు నష్టాలను భరించలేక టమాటను పొలాల్లోనే వదిలేస్తున్నారు.

పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కదు
టమాట సాగులో ఎకరాకు రూ.12వేల నుంచి రూ.16 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడులు పెడితే కొంత ఊరట లభిస్తుంది. దిగుబడి పెరిగినా పంట మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ధరలు పడిపోవడంతో పెట్టుడబడిలో 50 శాతం కూడా దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ధర రూ.200లోపే ఉండటంతో రూ.6వేల వరకే వస్తోంది. ఇందులో కోత, రవాణా చార్జీలు తీసేస్తే ఎకరాకు రూ.3వేలు కూడా దక్కట్లేదు.

మార్కెట్‌లను ముంచెత్తుతున్న టమాట
జిల్లాలోని మార్కెట్‌లను టమాట ముంచెత్తుతోంది. కర్నూలులోని సి,క్యాంపు రైతుబజార్‌కు రోజూ 160 క్వింటాళ్లు వస్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని కూరగాయల మార్కెట్‌కు 500 క్వింటాళ్ల వరకు వస్తోంది. జిల్లాలో పత్తికొండ, డోన్, ప్యాపిలి, ఆస్పరి మండలాల్లో టమాట మార్కెట్‌లు ఉన్నాయి. వీటికి సైతం భారీగా వస్తోంది. డిమాండ్‌ పడిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించాల్సిన ప్రభుత్వం మౌనం వహించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

పొలంలోనే వదిలేసినా
ఈసారి జూన్‌లోనే వర్షాలు పడటంతో అదే నెల మూడెకరాల్లో టమాట పెట్టిన్యాం. వర్షాదారం కింద కొంత, నీటి ఆధారం కింద కొంత వేసిన్యాం. ఎకరాకు పెట్టుబడి రూ.13వేల నుంచి రూ.15 వేల వరకు అయినాది. పంట బానే వచ్చినా ఎప్పుడూ లేనట్ల ధర పడిపోయినాది. పెట్టుబడిల 20శాతం కూడా వస్తలేదు. టమాటలు తెంపనీక రోజుకు మనిషికి రూ.100 పైనే ఇయ్యాల. మార్కెట్‌కి తీసుకపోనీక గంపకు రూ.30 పైనే అడుగుతారు. గిట్టుబాటు కాదని పొలంలోనే వదిలేసినా.
– బద్రిస్వామి, గిరిగెట్ల, తుగ్గలి మండలం

రూ.30వేల పెట్టుబడికి రూ.10వేలు
బోరు కింద ఒకటిన్నర ఎకరాల్లో టమాట సాగు చేసినా. పెట్టుబడి దాదాపు రూ.30 వేలు అయింది. దిగుబడి బాగాన్నా ధర పూర్తిగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో కిలో ధర రూ.15 వరకు ఉండింది. ఈ సారి 25 కిలోల గంపకు రూ.50 కూడా వస్తలేదు. 10 గంపలు మార్కెట్‌కు తరలిస్తే కూలి, రవాణా ఖర్చులు కూడా రావు. నష్టాలను భరించలేక టమాటలు తెంపడమే మానేసినా. ఇట్టాంటి పరిస్థితి యానాడు లేకుండె.
– గోపాల్, అరికెర, ఆలూరు మండలం

టమాట అత్యధికంగా సాగయ్యే మండలాలు:
ఆదోని డివిజన్‌: ఆస్పరి, దేవనకొండ, పత్తికొండ, మద్దికెర, పెద్దకడుబూరు, తుగ్గలి, కౌతాళం, హాలహర్వి ఆలూరు
కర్నూలు డివిజన్‌: డోన్, ప్యాపిలి, వెల్దుర్తి, కష్ణగిరి, ఓర్వకల్లు, కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, బేతంచెర్ల, గూడూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement