రిజిస్ట్రేషన్ ః షోరూమ్
Published Fri, Oct 14 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
తణుకు : రవాణా శాఖ సేవల్లో సంస్కరణలు తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆన్‌లైన్ సేవలను అందిస్తుండగా.. ఈనెల 15వ తేదీ నుంచి వాహనాలకు షోరూమ్‌ల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయల్లో రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికేందుకు దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం వాహనాలు కొన్న వెంటనే షోరూమ్‌ల్లోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అందిస్తున్నారు. ఇకపై శాశ్వత రిజిస్ట్రేషన్లను సైతం అక్కడే చేసే విధానాన్ని రాష్ట్రంలో దశల వారీగా అమలు చేస్తున్నారు. 15నుంచి మన జిల్లాలోనూ ఈ పద్ధతి అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై అవగాహన కల్పించేందుకు వాహనాలను విక్రయించే షోరూమ్‌ల నిర్వాహకులకు గురు, శుక్రవారాల్లో ఏలూరులో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు.
సేవలన్నీ ఆన్‌లైన్..
జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాల యాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసి ఆన్‌లైన్‌లోనే చేసేలా యం త్రాంగం చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఫ్యాన్సీ నంబర్లను సైతం ఆన్‌లైన్‌లో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏలూరులోని జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయం, భీమవరంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో యూనిట్ కార్యాల యాలు ఉన్నాయి. వాటి పరిధిలోని వాహనాలకు రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ఫిట్‌నెస్‌లు, రిజిస్ట్రేషన్, లైసెన్సుల రెన్యువల్స్, నకళ్లు వంటి 83 రకాల సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలన్నీ పొందడానికి వాహనదారులు ఆయా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు అధికారులు–వాహనదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సొమ్ములు గుంజు తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా వాహనదారులే ఆన్‌లైన్ ద్వారా సేవలు పొందేవిధంగా రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వాహనాలను విక్రయించే షోరూములకు అప్పగించనున్నారు.
గంటలో శాశ్వత రిజిస్ట్రేషన్
షోరూంలో వాహనం కొనుగోలు చేసిన 15 నిమిషాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్, గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు వాహనదారుడి సంతకం, వేలి ముద్రలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లో రవాణా శాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌లోని వేలిముద్ర సరి పోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతరం పత్రాలను వాహన యజ మాని ఇంటికి పంపిస్తారు. ఈ విధానంపై జిల్లాలోని వాహనాల షోరూం యాజమాన్యాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 15నుంచి అమలు చేయనున్నారు. ఫ్యాన్సీ నంబర్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ కావాల్సిన వాహనదారులు రవాణా కార్యాయాల్లో సంప్రదించాలి.
కార్యాలయానికి రానవసరం లేదు
వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు రవాణా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి వేలిముద్రలు, వాహనం ఫొటోలను షోరూమ్ నిర్వాహకులు రవాణా శాఖ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తారు. కార్యాలయ అధికారులు వాటిని నిర్థారించిన తర్వాత గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఫ్యాన్సీ నంబర్ల విషయంలో 15 రోజుల్లో స్పష్టత వస్తుంది.
– ఎస్.సత్యనారాయణమూర్తి, డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏలూరు
Advertisement
Advertisement