అమ్మ ఒడి | Rehabilitation centers good moving | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి

Published Thu, Sep 1 2016 8:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

శిక్షణ పొందుతున్న మానసిక వికలాంగులు

శిక్షణ పొందుతున్న మానసిక వికలాంగులు

  • వికలాంగుల ఆలనాపాలన చూస్తోన్న పునరావాస కేంద్రాలు
  • రోజంతా ఆటపాటలు.. ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీతో మేలు
  • ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి వరం
  • ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్రాలు
  • ఊపిరి పీల్చుకుంటున్న నిరుపేద కుటుంబాలు
  • మిరుదొడ్డి: వికలాంగుల పునరావాస కేంద్రాలు అమ్మ ఒడిని తలపిస్తున్నాయి. కన్నతల్లిదండ్రుల మాదిరిగా శారీరక, మానసిక వికలాంగుల ఆలనాపాలన చూస్తున్నాయి. మాటలు రాక కొందరు... కాళ్లు చేతులు పనిచేయక మరికొందరు.. పుట్టుకతో, పుట్టిన తర్వాత మరికొందరు... మానసిక, శారీరక వికలాంగులుగా మారుతున్నారు.

    తమ పనులు తాము చేసుకోలేని నిస్సహాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇలాంటి వారి బాగోగులు చూసేందుకు ప్రభుత్వ నిర్వహణలో జిల్లాలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. తిండి మొదలుకొని ఆటలు పాటలతో కాలక్షేపాన్ని కల్పిస్తున్నాయి.

    స్పీచ్‌, ఫిజియో థెరపీలతో మార్పు కోసం కృషి చేస్తున్నాయి. వికలాంగులు సైతం ఈ కేంద్రాల్లో సందడి చేస్తున్నారు. రోజురోజుకూ వారిలో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రతినిధులు మిరుదొడ్డి కేంద్రాన్ని అధ్యయం చేసి ప్రశంసలు కురిపించారు.

    ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని అక్కున చేర్చుకుంటున్నాయి వికలాంగుల పునరావాస కేంద్రాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా శారీరక, మానసిక వికలాంగులైన వారిని చేర్చుకొని వారిలో మార్పు కోసం కృషిచేస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లో వికలాంగులు ఉంటే కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా అనుక్షణం వారిని కనిపెట్టుకుని ఉండాలి.

    ఫలితంగా వారికి ఉపాధి లేకుండా పోతుంది. రెక్కాడితో గాని డొక్కాడని కుటుంబాల్లో ఒకరు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కేటాయించడం వల్ల కుటుంబ నడిచే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారిని చేర్చుకుని వారి ఆలనా పాలన చూస్తున్నాయి పునరావాస కేంద్రాలు.

    ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాల ప్రభుత్వ ఖర్చుతో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎనిమిది కేంద్రాలు సేవలందిస్తున్నాయి. వీరిలో గణనీయమైన మార్పు తీసుకొస్తున్నాయి. ఈ కేంద్రాల వల్ల ఎన్నో కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

    జిల్లాలో ఎనిమిది కేంద్రాలు
    మానసికంగా, శారీరక వికలాంగుల్లో మార్పు తేవడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో 8 మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి, న్యాల్‌కల్‌, నారాయణఖేడ్‌, నర్సాపూర్‌, కల్హేర్‌, జోగిపేట, మెదక్‌, కౌడిపల్లిలో పునరావాస కేంద్రాలు పని చేస్తున్నాయి. మానసిక, శారీరకంగా బాధపడుతున్న వికలాంగులను గుర్తించి పురావాస కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఆయా కేంద్రాల్లో సుమారు 880 మంది చేరారు.

    ఏపీఎం పర్యవేక్షణలో పిల్లలు
    మానసిక పునరావాస కేంద్రంలో క్లస్టర్‌ కోఆర్డినేటర్‌, ఈఐసీఆర్‌పీ (ఎర్లీ ఇంటర్వెన్షన్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌), కార్యకర్త, ఆయా పని చేస్తారు. పునరావాస కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో మూగ, చెవిటి, మానసిక, శారీరక వికలాంగులను గుర్తిస్తారు. సదరు కుటుంబ సభ్యులకు అవగాహన ‍కల్పిస్తారు. వారి అనుమతితో సదరు పిల్లలను పునరావాస కేంద్రాల్లో చేర్పిస్తారు. ఐకేపీ ఏపీఎం పర్యవేక్షణలో సీసీ, కార్యకర్త, ఆయాలు వీరి బాగోగులు చూస్తారు.

    రాకపోకలకు ప్రత్యేక వాహనం
    ఈ కేంద్రాల్లో చేరిన వారిని వివిధ గ్రామాల నుంచి తీసుకురావడానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. ఉదయం కేంద్రానికి తీసుకురావడం, సాయంత్రం తిరిగి అదే వాహనంలో ఇళ్లకు పంపిస్తారు. స్థానికులైతే వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్తారు.

    ఆకట్టుకునేలా శిక్షణ
    వివిధ ఆట వస్తువులు, వ్యాయామం చేసే పరికరాలు, అక్షర మాలలు, పండ్లు, కూరగాయల బొమ్మలు , చార్టులను అందుబాటులో ఉంచుతారు. మానసిక వికలాంగుల్లో మార్పు తేవడానికి ఆటపాటల ద్వారా శిక్షణ ఇస్తారు.  ప్రతి అంశాన్ని గుర్తించేలా అవగాహన కల్పిస్తారు. వికలాంగులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగ పడే ప్రతి వస్తువును సెర్ప్‌ సమకూరుస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అన్ని రకాల ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచింది.

    మానసిక వికలాంగులకు ఆత్మస్థైర్యం
    మానసిక వైకల్యంతో పుట్టిన వారికి పునరావాస కేంద్రం అపర సంజీవనిలా పనిచేస్తోంది. మానసిక వికలాంగుల్లో మార్పు తేవడానికి నెలలో రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ నిర్వహిస్తారు. ప్రతి కేంద్రాన్ని డీపీఎం (జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌)తోపాటు ముగ్గురు ప్రొఫెషనల్‌ అధికారులు సందర్శిస్తారు.

    మిరుదొడ్డి కేంద్రం టాప్‌
    మిరుదొడ్డిలో నిర్వహిస్తోన్న పునరావాస కేంద్రంలో సుమారు 78 మంది మానసిక, శారీరక వికలాంగులను గుర్తించగా ప్రస్తుతం 62 మంది శిక్షణ పొందుతున్నారు. జిల్లాలో అన్ని రకాలుగా సేవలను అందిస్తున్న కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. దీంతో జిల్లా అధికారులు దీన్ని అధ్యయన కేంద్రంగా గుర్తించారు.

    పలు రాష్ట్రాల ప్రతినిధుల అధ్యయనం
    మిరుదొడ్డి కేంద్రాన్ని నేషనల్‌ రూరల్‌ లైవ్లీవుడ్‌ మిషన్‌ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సందర్శించారు. ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, రాజస్థాన్‌, వెస్ట్‌ బెంగాల్, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు వారు సందర్శించి అధ్యయనం చేశారు. ఇక్కడ వికలాంగులకు అందిస్తోన్న సేవల తీరును అడిగి తెలుసుకున్నారు.

    మానసిక వికలాంగులను గుర్తిస్తున్నాం
    ఈ కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో మానసిక వికలాంగులను గుర్తిస్తున్నాం. ఆ వెంటనే  కేంద్రంలో చేర్పించి అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. మూగ, చెవిటి లోపం ఉన్న వారిని గుర్తించి హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆసుపత్రికి తరలిస్తాం. అక్కడి వీలైనంత వరకు చికిత్స అందేలా చూస్తాం. వారిలో మంచి మార్పు రావడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నాం. - కూరాకుల కవిత, ఈఐసీ రిసోర్స్‌ పర్సన్, ధర్మారం

    కంటికి రెప్పలా చూసుకుంటాం
    మానసికంగా, శారీరకంగా బాధపడుతున్న పిల్లలను పునరావాస కేంద్రంలో కంటికి రెప్పలా చూసుకుంటాం. ఆటపాటలతో మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాం. వస్తువులను గుర్తించడానికి అన్ని రకాల వస్తువులు అందిస్తాం. తినడానికి రాని వారికి తినిపిస్తాం. - యలగారి యశోద, కార్యకర్త, అల్వాల

    వికలాంగుల భవిష్యత్తుపై దృష్టి
    ఈ కేంద్రంలో ప్రతి వికలాంగుడికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం. ఒక్కో విలాంగుల గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. గ్రూపును బట్టి రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందిస్తున్నాం. దీంతో వికలాంగులకు ఉపాధి లభిస్తుంది. - మణెమ్మ, పునరావాస కేంద్రం మిరుదొడ్డి క్లస్టర్‌ కోఆర్డినేట

    పురావాస కేంద్రంతో మేలు
    పునరావాస కేంద్రంతో మాలాంటి వికలాంగులకు ఎంతో మేలు జరుగుతుంది. నడవలేని స్థితిలో ఉన్న నాకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదం చేసింది. ఈ మాత్రం నడవగలుగుతున్నానంటే పునరావాస కేంద్రంలో ఇచ్చిన శిక్షణ పుణ్యమే. - తుడుం కనకయ్య, వికలాంగుడు, లక్ష్మీనగర్‌

    ప్రతి ఒక్కరిపై పర్యవేక్షణ
    పునరావాస కేంద్రంలో చేరిన అన్ని రకాల వికలాంగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. వారికి ఏం కావాలో తెలుసుకొని అందిస్తున్నాం. మానసిక రుగ్మతలను గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నాం. పునరావాస కేంద్రాల్లో మెరుగుపడ్డ వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాం. - కృష్ణారెడ్డి, ఐకేపీ ఏపీఎం, మిరుదొడ్డి

    ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యం
    మానసిక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా జిల్లాలో ఎనిమిది కేంద్రాలు పని చేస్తున్నాయి. మానసిక వికలాంగులున్న కుటుంబాలు వారి బాగోగులు చూసుకోవడానికే రోజంతా గడిచిపోతుంది. దీంతో ఏ పని చేసుకోకుండా సమయమంతా వారితోనే గడిచిపోతుంది. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాంటి కుటుంబాల నిరుపేదలకు పునరావాస కేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయి. వికలాంగులను కేంద్రాల్లో చేర్పిస్తే వారి బాగోగులను మేమే చూసుకుంటాం. ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ ద్వారా వారిలో మార్పు వచ్చేలా చూస్తున్నాం. - మోహన్‌, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌, సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement