గుట్టువిప్పడంలో మొనగాళ్లు
-
సోషల్ మీడియాలో కలుసుకున్న 14 మంది ఐటీ విద్యార్థులు
-
సైబర్ నేరాల గుట్టు విప్పడంలో సిద్ధహస్తులు
-
వెబ్‌సైట్‌ల ర్యాంకింగ్ మెరుగు పరిచే ప్రయత్నం
ఏయూక్యాంపస్: వారంతా రెండు పదుల వయసు కలిగిన యువకులు. సాంకేతిక ప్రపంచంలో పోటీపడే మనస్తత్వం. ఉపాధిని వెతుక్కోవడమనే పదాన్ని పక్కన పెట్టేశారు. ఉపాధిని అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏయూ, గీతం, జేఎన్‌టియూ విద్యా సంస్థలకు చెందిన 14 మంది విద్యార్థులు కలసి ఒక సంస్థను స్థాపించారు. తమ మేథస్సునే పెట్టుబడిగా పెట్టి సాంకేతిక ప్రపంచంలో రారాజులుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల గుట్టు విప్పడంలో వీరు సిద్ధహస్తులు. స్టార్టప్‌గా వీరు ప్రారంభించిన ప్రయాణం ఒక్కో మెట్టు ఎక్కుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సెక్యూరిటీ రీసెర్చర్స్ లిస్ట్‌లో స్థానం సాధించారు. కొన్ని సందర్భాలలో పోలీసులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించారు. సాంకేతికతను మంచికోసం వినియోగిస్తూ సమాజానికి ఉపయుక్తంగా నిలుస్తున్న ఈ యువకుల ప్రస్థానం మీ కోసం.
మూడు విభాగాలు....
ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఐటీ విభాగాలకు చెందిన 14 మంది విద్యార్థులు సోషల్ మీడియా సహకారంతో కలుసుకున్నారు. వివిధ సదస్సుల్లో పరిచయం అయిన వీరంతా కలసి ఒక స్టార్టప్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. 2013 జూన్‌లో www.cyberaon.com వెబ్‌సైట్‌ను స్థాపించారు. ప్రాథమికంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం, హ్యాకింగ్ జరిగిన వెంటనే సంబంధిత సమాచారం పొందడం వంటి సేవలు అందించేవారు. 2014 వరకు వీరు ఇతరుల వెబ్‌సైట్‌లను పటిష్ట పరయడం చేశారు. తరువాతి కాలంలో వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, బ్లాగ్‌ల ఏర్పాటు, నిర్వహణ జరిపారు. అదే సమయంలో సెక్యూరిటీ సంబంధిత సదస్సుల్లో పాల్గొంటూ నూతన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశారు. సమాంతరంగా వివిధ ప్రముఖ వెబ్‌సైట్లలో డెవలప్‌మెంట్ లోపాలను గుర్తించి ఆయా సంస్థలకు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు.
విభిన్న సేవలు
సెర్చ్ ఇంజెన్ ఆప్టిమైజేషన్(ఎస్‌ఇఓ) చేయడం ద్వారా వెబ్‌సైట్‌ల ర్యాంకింగ్ మెరుగు పరిచే ప్రయత్నం చేశారు. పూర్తిస్థాయి సేవలు 2015లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 30కి పైగా విభిన్న సంస్థల వెబ్‌సైట్‌లను తీర్చిదిద్దారు. కార్పొరేట్ సంస్థలకు వెబ్‌సెక్యూరిటీ, ఎస్‌ఈఓలను సమకూర్చే అవకాశాలు వచ్చాయి. ప్రధాన వెబ్‌సైట్‌లలో పొందుపరచిన సమాచారం హ్యాక్ అవడం, మార్పుకు గురవకుండా చూడటం ఎంతో ప్రధానం. వెబ్‌సైట్‌లో పొందుపరచిన సమాచారం(డేటా)కు పూర్తి రక్షణ కల్పించే వ్యవస్థలను వీరు తీర్చిదిద్దుతున్నారు.
ప్రమోషన్
అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా నిలుస్తున్న సోషల్ మార్కెటింగ్‌ను వీరు పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. తాము వినియోగిస్తున్న వెబ్‌సైట్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్‌ల మధ్య అనుసంధానం చేయడం, ప్రకటనల వీడియోలను ఉంచడం వంటి సేవలు అందిస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రకటన రంగంలో విస్తరించిన సేవలు
వ్యాపారానికి సంజీవనిగా నిలిచే అడ్వటైజింగ్ రంగంలోను వీరు తమ సేవలు విస్తరించారు. అత్యంత అధునాతన సాంకేతిక ఉపకరణాలు, డ్రోన్‌లు వినియోగించి వీడియోలను తయారు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రమోషనల్ వీడియోలో తయారు చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ సాంకేతిక ప్రతిభతో ఆయా వీడియోలను సామాజిక మాధ్యమాలలో ఉంచుతూ ప్రచారం కూడా కల్పిస్తున్నారు. రెండు విభిన్న సేవలు ఒకే వేదికగా అందించడంతో వ్యాపార సంస్థలు సైతం వీరికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.
వెబ్ సెక్యూరిటీ
భారతీయ వెబ్‌సైట్‌లను పూర్తి రక్షణతో తీర్చిదిద్దాలనేని వీరి లక్ష్యం. వివిధ వెబ్‌సైట్‌లో అంతర్గత లోపాలను గుర్తించి వారికి తెలియజేయడం వలన వీరికి రూ.20 వేల డాలర్ల మూలధనం సమకూర్చుకున్నారు. తమ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే దిశగా నూతన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నారు. దీని సహాయంతో 90 శాతంపైగా వెబ్‌సైట్‌కు రక్షణ లభిస్తుంది. దీనిని శతశాతం రక్షణ చేసే దిశగా వీరు ప్రయత్నం చేస్తున్నారు.
విద్యార్థులకు సైబర్ అవేర్‌నెస్ కల్పించే దిశగా అవగాహన సదస్సులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కళాశాల యాజమాన్యాలను సంప్రదించి అనుమతులు పొందారు. సైబర్ నేరగాళ్లను, మోసాలను నియంత్రించడంలో అవసరమైన సహకారాన్ని అందించడానికి సంసిద్ధత వ్యక్త చేశారు. ఈ బందంలో కొదరు దూర ప్రాంతాలలో ఉంటూ సంస్థ సేవల్లో పాలుపంచుకోవడం విశేషం.
సెక్యూరిటీ లక్ష్యం....
సాంకేతిక విస్తరిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో సెక్యూరిటీ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికి పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో సేవలు అందించే సంస్థగా అభివద్ధి చేస్తున్నాం. ఆలోచలను పెట్టుబడిగా పెడుతున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
–మహ్మద్ అజారుద్దీన్
సేవలే ఆదాయాన్ని అందిస్తున్నాయి
సంస్థ నిర్వహణకు అవసరమైన నిధులు, నిర్వహణ ఖర్చులకు మేము అందించే సేవల నుంచి ఆదాయం లభిస్తోంది. అదే విధంగా గూగుల్ యాడ్స్‌సెన్స్ నుంచి కొంత ఆదాయం సమకూరుతోంది. వీటి సహయంతో సంస్థను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం.
–చింతల శ్రీనివాస్, సీటీవో