వేంకటేశ్వరస్వామి ఆలయం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 14 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమణమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మలు తెలిపారు. 10న ఉదయం 8.31 గంటలకు ఉత్సవ మూర్తులను యాగశాల ప్రవేశం చేయించడం, 10.35 గంటలకు కలశ స్థాపన, గణపతి పూజ, రుత్వికరణ రక్షాబంధనం హోమాలు, గిరి ప్రదక్షణ, 11న ఆలయాల్లోని స్వామి మూర్తులకు పవిత్రాలధారణ, 12న పూర్ణాహుతి, పవిత్రాల విసర్జన, అవబృందస్నానం, శాంతి కల్యాణం, 13న శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, అమ్మవార్లను శాకంబరీ దేవి అవతారంలో అలంకరించడం, గిరి ప్రదక్షణ, 14న శ్రీవేంకటేశ్వర స్వామివారికి, ఉత్సవ మూర్తులకు, పుష్పయాగం, భక్తులతో సామూహిక మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అత్యంత వైభవంగా, ఆలయ ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించనున్న ఈ పవిత్రోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవారి, అమ్మవార్ల కటాక్షాన్ని పొందాలని ఈఓ రమణమూర్తి కోరారు.