యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయండి
-
మంత్రి పి.నారాయణ
నెల్లూరు(పొగతోట) : వార్దా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ అ«ధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్‌లో హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షంతో మెట్టప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందన్నారు. వర్షాలకు 600 విద్యుత్ పోల్స్ దెబ్బతిన్నాయన్నారు. సబ్‌స్టేషన్లకు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. డాక్టర్లు పీహెచ్‌సీలల్లో అందుబాటులో ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తెలిపారు.
ఆన్‌లైన్‌లో తప్పనిసరి
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మంజూరైన ప్రతిపనిని ఆన్‌లైన్‌లో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాతే ఆర్థిక పరమైన అనుమతులు వస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ నిధులను కార్పొరేషన్, మున్సిపాలిటీలకు అత్యధికంగా కేటాయించడం జరిగిందని, చైర్మన్లు సమావేశాలు ఏర్పాటుచేసి పనుల నివేదికలను సిద్ధ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ ఏ మహమ్మద్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దాలి
నెల్లూరు(పొగతోట) : అంగన్‌వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదాద్దాలని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌హాలులో మున్సిపల్ కమిషనర్లు, సీడీపీపీఓలు, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిలోమీటరు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చే ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి కావాలని ఆదేశించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.