
ఆస్పత్రిలోనే చిట్టితల్లి
♦ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రేష్మా
♦ వదిలించుకున్న కర్కశ తల్లిదండ్రులు
♦ వారం గడిచినా ఆచూకీ లేని కన్నవారు
♦ విచారణలో తీవ్ర జాప్యం పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
పాపం.. ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చింది. తల్లిదండ్రుల చేతుల్లోనే నరకం అనుభవించింది. సిగరెట్ వాతలను భరించింది.. దండించినా మౌనంగా ఉండిపోయింది. రక్తం కక్కేలా చితక బాదినా కిమ్మనలేదు. అభంశుభం తెలియని ఈ చిన్నారిని హింసిస్తున్న విషయం వారం రోజుల క్రితం వెలుగు చూసింది.
పాపను వదిలించుకునేందుకు ఇదే మంచి మార్గమని భావించారు కన్నతల్లి, మారుతండ్రి. జాగ్రత్తగా నడుచుకోవాలని అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వగా అన్నింటికి సరేనంటూ తలూపారు. ఆ మరుసటి రోజు నుంచే జాడలేకుండా పోయారు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఈ చిన్నారి అమాయకపు చూపులు ప్రతిఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ చిన్నారి భవిష్యత్తు ఏమిటో పోలిసులు, అధికారులకే తెలియాలి..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెప్పిన మాట వినడం లేదని.. నాలుగేళ్ల చిన్నారి రేష్మా పట్ల కర్కశంగా వ్యవహరించారు తల్లిదండ్రులు చక్రవర్తి, రజియా సుల్తానా. ఈ విషయం ఈనెల 18న వెలుగు చూడడంతో పోలీసుల కన్నుగప్పి పరారయ్యారు. వారం రోజులు గడిచినా ఈ కేసు విషయంలో పురోగతి లేదు. ఇప్పటికే వారిని అరెస్టు చేయాల్సిన బొల్లారం పోలీసులు రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారు. ఏ పాపం తెలియని చిన్నారి రేష్మా అలియాస్ ప్రియాంక మాత్రం అనాథగానే సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి చికిత్స పొందుతోంది.
చిన్నారిని చూసేందుకు చిన్నారి సొంత తండ్రిగాని, తల్లి లేదా తల్లితరఫు బంధువులు ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందే పాపకు సపర్యలు చేస్తున్నారు. ఒంటి నిండా సిగరెట్‌తో వాతలు ఇంకా తగ్గనేలేదు. ముఖం మీద గాయాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గుంటూరు పట్టణం రామారెడ్డి రెండో వీధికి చెందిన రాధిక అలియాస్ రజియా సుల్తాన్ (పాప తల్లి) ఆరు నెలల కిందటే భర్త హబీబ్ కళ్లుగప్పి చక్రవర్తితో రహస్యంగా వచ్చినట్టు సమాచారం. జిన్నారం మండలం పోచమ్మబస్తీలో కాపురం పెట్టి పసిపాపపై పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే.
కౌన్సెలింగ్ తరువాత పాపతోపాటు ఒక రోజు ఆసుపత్రిలో ఉన్న రజియా సుల్తానా మరుసటి రోజు ఎవరికి చెప్పాపెట్టకుండా తన ప్రియుడు చక్రవర్తితో కలిసి పరారైంది. వారు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసుల వద్ద సమాచారం లేదు. రేష్మా కేసు విషయంలో పోలీసులు మొదటి నుంచీ ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాపను తీవ్రంగా గాయపరిచిన వారిని అదుపులోకి తీసుకోకుండా కేవలం కౌన్సెలింగ్‌తోనే వదిలేశారని.. ఇదే వారు పారిపోవడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. రజియా సుల్తానా, చక్రవర్తి ఇచ్చిన తప్పుడు సమాచారంతో పోలీసులు బోల్తా పడ్డారు.
‘సాక్షి’ అసలు గుట్టు విప్పడంతో మేల్కొన్న పోలీసులు.. విచారణ పేరుతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వారిని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు తెలియక పోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఎప్పుడు అరెస్టు చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు రేపు..మాపు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి బొల్లారం పోలీసులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది. ఈ పోలీసు స్టేషన్ పరిధిలో పసిపిల్లలపై దాష్టికాన్ని ప్రదర్శించి, దారుణంగా హింసించడం ఇది రెండోసారి. ఇదే స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న జాకీర్ హుస్సేన్ దంపతులు హైదరాబాద్‌కు చెందిన సబా అనే పసిపాపను తీసుకొచ్చి చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఇదే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన పట్ల ఉదాసీనతతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
కోలుకోవడానికి సమయం పడుతుంది..
రేష్మా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆహారం తీసుకుంటోంది. పాప పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. చర్మంపై ఉన్న కాల్చిన గాయాలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఇవి పూర్తిగా తగ్గడానికి ఇంకొంత సమయం పడుతుంది. - డాక్టర్ శ్రావ్య