ఒకరితో ప్రేమ...మరొకరితో పెళ్లి!
ఓ రిటైర్డు కానిస్టేబుల్ కుమారుడి బాగోతం
సాక్షి ప్రతినిధి,కడప : వాళ్లిద్దరూ ఒకే కళాశాలలో చదవడంతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి నమ్మింది. ప్రస్తుతం ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువతి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు యువకుడిపై కేసు నమోదైంది.
కడప నగరం రవీంద్రనగర్‌కు చెందిన ఓ యువతికి ప్రొద్దుటూరులోని రాజేశ్వరినగర్‌లో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్‌కు మధ్య కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం నడుస్తోంది. కడపలో చదువుతున్న సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చి, జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని వాళ్లిద్దరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. కొన్ని రోజుల తర్వాత యువతికి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆమె ప్రస్తుతం ప్రొద్దుటూరులోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్ కూడా అక్కడే ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు.
కట్నం కోసం మరో పెళ్లికి సిద్ధం..
ఇమ్రాన్‌ఖాన్‌కు ఇటీవల రూ. 10 లక్షలు నగదుతో పాటు సుమారు 40 తులాలకు పైగా బంగారు కట్నంగా ఇస్తామని రాజంపేట నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. కుమారుడు కడపకు చెందిన యువతిని ప్రేమించిన విషయం తెలిసినప్పటికీ అతని తండ్రి జాఫర్‌ఖాన్( రిటైర్టు కానిస్టేబుల్) రాజంపేట సంబంధానికి అంగీకారం తెలిపాడు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసినా పట్టించుకోలేదు. అనుకున్నట్టే రాజంపేటలో కుమారుడికి సంబంధం కుదుర్చుకున్నాడు. అంతేకాదు ఈ నెలలోనే పెళ్లి కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
యువతి ఫిర్యాదుతో ఇమ్రాన్‌ఖాన్‌పై కేసు..
ఇమ్రాన్‌ఖాన్ తనను మోసం చేశాడని గ్రహించిన యువతి న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివిరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పఠాన్ ఇమ్రాన్‌ఖాన్, తండ్రి జాఫర్‌ఖాన్‌లపై కేసు నమోదైంది. ఈ మేరకు ప్రొద్దుటూరు పోలీసులు అతన్ని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తండ్రి మాట కాదనలేక వేరే యువతితో వివాహం చేసుకుంటున్నట్లు స్వయంగా ఇమ్రాన్ అంగీకరించినప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారని యువతి ఆరోపిస్తోంది. కాగా ఇమ్రాన్‌ఖాన్‌ను వదలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె చెబుతోంది. తనలా మరే అమ్మాయి మోసపోరాదని, అందుకోసం ఎంత వరకైనా న్యాయపోరాటం చేస్తానని పేర్కొంటోంది.