బేరుపల్లెలో విలేకరులతో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
–అక్కసుతోనే కరుణాకర్‌రెడ్డిపై విచారణ
–నిర్భందంగా అరెస్టులు చేస్తే తగిన మూల్యం తప్పదు
–వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పలమనేరు:
తమ పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్‌రెడ్డిపై చంద్రబాబు తుని కేసులో సీఐడీచే విచారణ జరపడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో సాగుతోందని ఇలాంటి కుట్రలను తమ పార్టీ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని బేరుపల్లెలో బుధవారం ఆయన నియోజకవర్గ కోఆర్డినేటర్లు రెడ్డెమ్మ, కుమార్, రాజేష్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. తునిలో జరిగిన సంఘటనకు తిరుపతిలోని కరుణాకర్ రెడ్డిని బాధ్యున్ని చేసి గంటలకొద్దీ విచారించడం ఎంతవరకు సమంజసమన్నారు. కేవలం తమ పార్టీని టార్గెట్ చేసి ఇలాంటి నీచ రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూన్నారని తెలిపారు. కాపులకు మోసం చేసిన బాబు అనవసరంగా ఈకేసును వైఎస్సార్‌సీపీపైకి మోపడం సిగ్గుచేటన్నారు. కరుణాకర్‌రెడ్డిని నిర్భందంగా అరెస్టులు చేయాలని చూస్తే తాము చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చేందుకు సిద్ధమని తెలిపారు. ఇలాంటి తప్పుడు కేసులకు తాము బెదిరేది లేదన్నారు. నోటుకు కోట్లు కేసు విచారణను ఎదుర్కొనే దమ్ములేని ముఖ్యమంత్రి కోర్టులో స్టే తెచ్చుకున్నారని తమ నేత కరుణాకర్ రెడ్డి ఎటువంటి తప్పుచేయలేదు కాబట్టే ధైర్యంగా విచారణకు వెళ్ళారన్నారు. దీని పర్యవసానం ఈ ప్రభుత్వంపై తప్పదని చంద్రబాబుకు గట్టిగా బుద్దిచెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు, కుట్రలను పక్కనబెట్టి ప్రజలకిచ్చన హామీలను నెరవేర్చి వారి సమస్యలను పట్టించుకుంటే బాగుంటుందని ఆయన సీఎంకు హితవు పలికారు.