ఘనంగా తీజ్ ఉత్సవాలు
ఘనంగా తీజ్ ఉత్సవాలు
Published Sun, Jul 24 2016 9:06 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
త్రిపురారం : ఏడుగురు దేవతలను శాంతి పర్చడానికి ముత్తాతల నుంచి తీజ్ పండుగ నిర్వహించడం తమ ఆనవాయితీ అని సర్పంచ్ మూడావత్ నర్సింహనాయక్, టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు హన్మంతునాయక్ పేర్కొన్నారు. మండలంలో అప్పలమ్మగూడెం గ్రామపరిధిలోని లోక్యాతండాలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న తీజ్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన తీజ్ పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం కాని గిరిజన యువతులు తీజ్ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి పూజలు నిర్వహించారు. చివర రోజు తీజ్ బుట్టలను ఎత్తుకుని తండాలోని వీధుల్లో సంప్రదాయ నృత్యాలు చేశారు. తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చోగా యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవుల్లో పెట్టారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి తండా సమీపంలోని బావుల్లో కలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సేవానాయక్, తండా పెద్దలు ధనావత్ హనుమంతు నాయక్, కాంతారావు, స్వామినాయక్, ధన్ను నాయక్, జాను, రాజు, బగ్గు, లాలు, యూత్ కమిటీ సభ్యులు స్వామి, అంజి, రవి తదితరులు ఉన్నారు.
Advertisement