రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి టీవీ' సంపాదించింది. ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ప్రేమించాలంటూ రిషితేవ్వరిపై సీనియర్ విద్యార్థులు ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో శ్రీనివాస్, జయచరణ్లు కలిసి రిషితేశ్వరిపై వదంతులు ప్రారంభించారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది.
ర్యాగింగ్లో భాగంగా హాస్టల్ నుంచి రిషితేశ్వరిని రూమ్మెట్స్ బయటకు నెట్టారని, వార్డెన్ స్వరూపరాణి, ఆఫీస్ అసిస్టెంట్ రాజ్కుమార్కు ఫిర్యాదు చేసిందని, ఏప్రిల్ 18న కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా రిషితేశ్వరికి మిస్ పర్ఫెక్ట్ అవార్డు వచ్చిందని, అదేరోజు రిషితేశ్వరి పట్ల శ్రీనివాస్, జయచరణ్ అసభ్యంగా ప్రవర్తించారని, ర్యాగింగ్ శృతి మించడంతో జులై 14న హాస్టల్లో చున్నీతో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్టులో ఉంది.
చున్నీకి వేలాడుతున్న రిషితేశ్వరిని మొదటగా విద్యార్థినులు... సుజాత, కుసుమలత, గౌరిలు చూశారని, మధ్యాహ్నం 2.30గంటలకు యూనివర్సిటీ అంబులెన్స్లో ఆమెను గుంటూరుకు తరలించారని,ఆత్మహత్య చేసుకున్న రూమ్లో 2 నైలాన్ తాడులు గుర్తించామని, నిందితులపై ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం అదుపులోకి తీసుకున్నామని, ఈ నెల 16న యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, రిషితేశ్వరి కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.