రెప్పపాటులో ఘోరం
-
ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
-
అనపర్తికి చెందిన నలుగురి దుర్మరణం
-
ఒకరి పరిస్థితి విషమం
-
ప్రత్తిపాడువద్ద ప్రమాదం
ప్రత్తిపాడు :
రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. రహదారిపై నెత్తుటేరు పారింది. వేగంగా వస్తున్న ఓ కారు.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్తిపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, మృతుల బంధువుల కథనం ప్రకారం..
అనపర్తికి చెందిన పాస్టర్ కోరాటి నిత్యజీవ స్తోత్రపతిరాజు (40) తన భార్య క్రాంతికుమారి (30), అక్కలు కోరాటి రాణి, ఎలిచెర్ల స్తోత్రకుమారి (55), బావ, అడ్వకేట్ అయిన ఎలిచెర్ల సుదర్శన్‌కుమార్(60)లతో కలిసి తైలాభిషేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం కారులో విశాఖ వెళ్లారు. మంగళవారం సాయంత్రం అదే కారులో తిరుగుపయనమయ్యారు. పుత్ర చెరువు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కంకర లోడుతో రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను వారి కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ సీటులో ఉన్న స్తోత్రపతిరాజు, ఆయన పక్కన ఉన్న భార్య క్రాంతికుమారి, వెనుక సీటులో ఉన్న అక్క ఎలిచర్ల స్తోత్రకుమారి, బావ సుదర్శన్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో మహిళ రాణి తీవ్రంగా గాయపడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.
కారు ఢీకొన్న సమయంలో వెలువడిన శబ్దానికి జాతీయ రహదారిపై పాదచారులు ఏం జరిగిందోనని భయంతో పరుగులు పెట్టారు. యువజన సంఘం నాయకుడు గోపిశెట్టి శ్రీను అటుగా వెళ్తున్న లారీని ఆపి, డ్రైవర్ సాయంతో కారు అద్దాలు పగులగొట్టి, అతి కష్టంమీద కోరాటి రాణిని వెలుపలికి తీసి, 108లో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎస్.రాజశేఖర్, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ కె.నాగ మల్లేశ్వరరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తదితరులు పరిశీలించారు. ప్రత్తిపాడు సీఐ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్తంభించిన ట్రాఫిక్
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. డీఎస్పీ రాజశేఖర్ క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను, కారును తొలగించి, ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ఎక్కువ సమయం శ్రమించాల్సి వచ్చింది.
అనపర్తిలో విషాదఛాయలు
అనపర్తి(బిక్కవోలు) : గ్రామంలో అందరితో ఆప్యాయంగా ఉండే ఆ కుటుంబం దైవ ప్రార్థనలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందన్న విషయం మంగళవారం రాత్రి తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అనపర్తి పాత హరిజనపేటలో పాస్టర్‌గా అందరికీ సుపరిచితమైన కోరాటి స్త్రోత్రపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం విశాఖపట్నంలో జరిగే దైవప్రార్థనలకు వెళ్లారు. సాయంత్రానికి ప్రార్థనల కార్యక్రమం ముగించుకుని స్తోత్రపతి రాజు∙సోదరుడు పాస్టర్ డాక్టర్.రాజు వారి కుటుంబ సభ్యులతో కలసి అనపర్తి సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. అయితే మిగిలిన పనులు చూసుకుని బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.