
ఆటో ఢీకొని ముగ్గురు హోంగార్డులకు తీవ్ర గాయాలు
లక్కిరెడ్డిపల్లె: ఏఎస్పీ సమావేశానికి హాజరయ్యేందుకు మోటారుసైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు హోంగార్డులను ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు హోంగార్డులు విరూపాక్ష, సహాదేవ, చిన్న రెడ్డెయ్య(చిన్ని) పులివెందులలో జరిగే ఏఎస్‌పీ మీటింగ్‌లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. లక్కిరెడ్డిపల్లె సమీపంలోని దొర్రి చెరువు మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. వెనుకాల కారులో అదే మీటింగ్‌కు వెళ్తున్న మరి కొంత మంది సిబ్బంది గమనించి 108కు సమాచారం అందజేశారు. బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేకువజామున వేళ కావడంతో ఆటో డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు గాయపడిన హోంగార్డులు తెలిపారు. పులివెందులలో ఏఎస్‌పీ సమావేశం జరిగిన ప్రతి సారి తెల్లవారే సరికి అక్కడికి చేరుకోవాలంటే.. ఆ సమయంలో ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. సంఘటన స్థలానికి లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఐ రాజా ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.