అరకొర జీతాలు.. అందులోనూ కోతలు
ఇబ్బందిగా జీవితం వెళ్లదీస్తున్నామంటూ హోంగార్డుల ఆవేద
ననవంబర్ తొలివారంలో ఆందోళన బాట పట్టే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి విధుల్లో అత్యంత కీలకమైన హోంగార్డులు.. అరకొర జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నెలలో ఒక్కో తేదీన వేతనాలు వస్తున్నాయని.. ఒక్కోసారి సగం నెల గడిచినా జీతాలు అందని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు.
తమకు కనీస జీవన భద్రత లేదని, హోంగార్డు చనిపోతే కారుణ్య నియామకంగానీ, మరేదైనా తీరులోగాని వారి కుటుంబాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన బాట పట్టాలనే యోచనతో ఉన్నామని అంటున్నారు.
సీఎం హామీలు అమలు చేయాలంటూ..
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని హోంగార్డులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డుల వేతన సవరణతోపాటు సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారని చెప్తున్నారు.
ఇక తాజాగా శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి.. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలు అందులో చదువుతారని పలుమార్లు పేర్కొన్నారు. అయితే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ జీవోలో మాత్రం హోంగార్డుల ప్రస్తావన లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయి విధుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే తమకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు ఆశతో ఎదురుచూశామని, కానీ అలాంటి హామీ ఏదీ రాలేదని వాపోతున్నారు. యూనిఫాం అలవెన్స్, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ సహా పలు కీలక హామీలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం నుంచీ పెండింగ్‌లో ఉన్నాయని... కాంగ్రెస్ ప్రభు త్వంలోనైనా అవి పరిష్కారం అవుతాయన్న ఆశతో ఉన్నామని చెప్తున్నారు.
కదలని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ ఫైల్..
హోంగార్డులను సైతం లాస్ట్ పేగ్రేడ్ కింద తీసుకుని, వారిని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (ఎస్‌పీఏ)గా మార్చాలని 2017లో ప్రతిపాదన సిద్ధం చేశారు. రిక్రూట్‌మెంట్‌లో లోటుపాట్లను సరిదిద్ది, వారిని పర్మినెంట్ చేసి దీన్ని అమలు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పలు కారణాలతో ఇది పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13వేల మంది జనరల్ డ్యూటీ హోంగార్డులు, మరో 2,500 మంది వరకు ఓడీ (అదర్ డిపార్ట్‌మెంట్) హోంగార్డులు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment