గోదావరిఖని: సమస్యలు పరిష్కరించాలని గొంతెత్తినందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనను విధుల నుంచి తొలగించిందని, జీవనోపాధి లేకుండా రోడ్డున పడేసిందని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమై.. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేసినా, నాయకులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈమేరకు శనివారం సీఎం నిర్వహించే ప్రజాదర్బార్‌కు వెళ్లారు. అక్కడ తన గోడు వెళ్లబోసుకున్నారు.
ఉద్యోగ భధ్రత కోసం ఆందోళన..
సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో 2016లో హోంగార్డులు ధర్నా చేశారు. గోదావరిఖనికి చెందిన హోంగార్డు మామిడి పద్మ ఆందోళనల్లో పాల్గొని బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. పర్యవసనంగా ఆమె తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆమెకు తన ముగ్గురు పిల్లల పోషణ ఇబ్బందిగా మారింది. భర్త వదిలేయడంతో ఏ పనిచేసుకోవాలో తెలియక, తన ఉద్యోగం తిరిగి ఇప్పించాలని సీపీ, డీజీపీ, హోంమంత్రిని వేడుకున్నారు.
హోంగార్డు పద్మ 2009లో వేములవాడలో తొలిపోస్టింగ్, రెండేళ్లు పనిచేసిన తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. జీతాలు పెంచి ప్రతినెలా చెల్లించాలనే డిమాండ్‌తో ఏడేళ్ల క్రితం వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి గాంధీ ఆస్పత్రి వద్ద హోంగార్డులు ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్నందుకు పద్మ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈమెపై అనేక కేసులు బనాయించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈరోజు తన గోడును కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సమస్య పరిష్కరించి ఉద్యోగం ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment