పెళ్లి మండపం కట్టి వస్తూ పరలోకాలకు..
పెరవలి : పెళ్లి మండపం కట్టి వస్తూ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పూలవ్యాపారి మృతిచెందిన ఘటన జాతీయ రహదారిపై పెరవలి రామకృష్ణ రైస్ మిల్లు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన టెక్కలి శివకుమార్ (48) పూల వ్యాపారి. వ్యాపారం నిమిత్తం తణుకులో పెళ్లి మండపం కట్టి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. పెరవలిలో రామకృష్ణ రైస్ మిల్లు సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు పోలీసులకు, ఎన్‌హెచ్ అం బులెన్స్‌కు సమాచారం ఇచ్చి శివకుమార్‌ను తణుకు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు పెరవలి ఎస్సై అప్పగించారు.
కాకరపర్రులో విషాదఛాయలు
శివకుమార్ మృతి వార్త తెలియడంతో కాకరపర్రు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శివకుమార్ అందరితో కలివిడిగా ఉండేవాడని తోటి వ్యాపారులు అన్నారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడిని రోదించారు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శివకుమార్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి చేశాడని గ్రామస్తులు చెప్పారు.