మృత్యుమార్గాలు
జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలోని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిర్లక్ష్యం ఎవరిదైనా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లోనే 1,567 రోడ్డు ప్రమాదాలు జరగడం... 451 మంది మరణించడం... 1,881 మంది గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 18 ప్రదేశాలను గుర్తించినప్పటికీ... ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు. సర్కారు నిధులు మంజూరు చేయకపోవడంతో రహదారి భద్రత ప్రణాళిక ఆచరణ సాధ్యం కావడం లేదు. అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదు.
గుణపాఠం నేర్వరా...
రోడ్డు ప్రమాదాల విషయంలో గత ఏడాది మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా దాదాపు అదేస్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత ఏడాదిలో మొదటి స్థానంలో నిలిచినా పాలకులు గుణపాఠం నేర్చుకోలేదు. అందువల్లే ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
విస్తరణకు రూ.100కోట్లు కావాలి...
జిల్లాలో 2014 నుంచి వాహనాల రద్దీ మూడు రెట్లు పెరిగింది. ఉన్న రోడ్లు.. పెరిగిన రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. రోడ్డు ప్రమాదాల సమస్యపై పోలీస్, రవాణా, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న 18 ప్రదేశాలను గుర్తించాయి. ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్లను విస్తరించాలని నివేదించారు. ఇందుకోసం రూ.100 కోట్లు అవసరమని తెలిపారు. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. జిల్లాలో రోడ్డు మీద మృత్యుఘోషను ఆపేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేయకపోవడం గమనార్హం.
తాత్కాలిక చర్యలకు అధికారుల ప్రణాళిక
రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలకు ప్రభుత్వం చొరవ చూపించలేదు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులతో కూడిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ప్రమాదకరమని గుర్తించిన ప్రదేశాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు కొన్ని తాత్కాలిక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఆ 18 ప్రదేశాల్లో రోడ్ల వెంబడి ఆక్రమణలు తొలగించాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్పీడ్‌బ్రేకర్లు, థర్మో–ప్లాస్టిక్ మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు వేయనున్నారు. ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్, హాట్ కెనాల్ వద్ద మెటల్ క్రాస్ బ్యారియర్లు మరో 150 మీటర్లు పొడిగించాలని నిర్ణయించారు.
జిల్లా అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని సర్వేలో గుర్తించిన 18 ప్రదేశాలు
1. గొల్లపూడి వై జంక్షన్
2.గొల్లపూడి వన్ సెంటర్
3.నల్లకుంట సెంటర్
4.గుంటుపల్లి సెంటర్
5.తుమ్మలపాలెం సెంటర్
6.ఇబ్రహీంపట్నం కేరళ హోటల్ సెంటర్
7.ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ కూలింగ్ కెనాల్స్
8.ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ హాట్ కెనాల్
9.జూపూడి జంక్షన్
10.మూలపాడు సెంటర్
11. దొనబండ సెంటర్
12.ఆతుకూరు పెట్రోల్ బక్ సెంటర్
13.పెద్ద అవుటపల్లి
14.గన్నవరం విమానాశ్రయం
15. నిడమానూరు జంక్షన్
6. కేసరపల్లి సెంటర్
17.గన్నవరం పృథ్వీ వైన్స్ సెంటర్
18. ఎంకిపాడు సెంటర్
రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం
జిల్లాలో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించాం. అక్కడ యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో నిర్ణయించాం. త్వరలోనే ఆ పనులు చేపడతాం. రాజధానిలో రహదారి భద్రత కల్పించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది. – మీరా ప్రసాద్, డెప్యూటీ కమిషనర్, రవాణా శాఖ