ఎరుపెక్కిన మన్యం.. రక్తమోడిన రహదారులు
రోడ్డు ప్రమాదాల్లో 684 మంది దుర్మరణం
63 హత్యలు, 125 లైంగిక దాడులు
ఏడాదిలో తొమ్మిది ఎదురుకాల్పులు
85 మంది మావోయిస్టు దళ సభ్యుల అరెస్ట్
విశాఖపట్నం: కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. విభిన్న జ్ఞాపకాలను మిగుల్చుతూ 2015 వీడ్కోలు చెప్పింది. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాదిలో నేరాలు, ఘోరాలను గమనిస్తే, బోలెడు ఆందోళన.. కొద్దిగా స్వాంతన కలుగుతాయి. గడిచిన సంవత్సరం విశాఖ రూరల్, సిటీ పరిధిలో రక్తం చిందించిన జాడలు కనిపిస్తాయి. గడిచిన ఏడాదిలో 63 మంది హత్యకు గురయ్యారు. వాటిలో రూరల్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరిగాయి. మహిళలపై లైంగిక దాడులు మాత్రం నగర పరిధిలో ప్రమాదకర స్థాయిలో పెరిగాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని తనిఖీలు చేసేందుకు బ్రీత్ అనరైజర్స్ రావడంతో ఈ ఏడాది ఆ కేసులు ఎక్కువగా పట్టుకున్నారు. ఈ ఏడాది కొత్తగా కాల్ మనీ కేసులు నమోదయ్యాయి. మన్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు జోరందుకున్నాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య తొమ్మిది సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. 85 మంది దళ సభ్యులు అరెస్టయ్యారు రోడ్డు ప్రమాదాల్లో 684 మంది దుర్మరణం పాలయ్యారు.
నేరాలు వెనకడుగు
నగరంలో నేరాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2015లో 5305 కేసులు నమోదుకాగా గతేడాది వాటి సంఖ్య 5378గాఉంది. సీసీటీఎన్ ప్రాజెక్టు, వెహికల్ ట్రాకింగ్ సిస్టం, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సిస్టం, జైల్ రిలీజ్ మోనటరింగ్ సిస్టం, చలానా సిస్టంలను ఈ ఏడాది అమలులోకి తీసుకువచ్చారు. 43 కాల్‌మనీ కేసులు నమోదయ్యాయి. 2014లో 345 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే 2015లో ఆ సంఖ్య 355కు చేరింది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 2015లో 4,91,522 కేసులు నమోదు చేసి రూ.9.06 లక్షల జరిమానా వసూలు చేశారు. 35 భూ కబ్జా కేసులు నమోదు చేసి 198 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి ముఠాలపై 13 పర్యాయాలు దాడులు చేసి 36 మందిని, ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్‌పై 107 దాడులు చేసి 722 మందిని అరెస్ట్ చేశారు.క్రికెట్ బెట్టింగ్‌లు, డ్రగ్స్, ఆయిల్‌మాఫియా, రైస్‌పుల్లింగ్, వ్యభి చార ముఠాలపై కేసులు నమోదు చేశారు. నగరంలో అంతర్రాష్ట ముఠాలు హల్‌చల్ చేశాయి. వరలక్ష్మీ వ్రతం రోజు ఏకంగా తొమ్మిది చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.
రగిలిన మన్యం
2015లో మన్యం మళ్లీ ఎరుపెక్కింది. తొమ్మిది సార్లు మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు దళ సభ్యుడు కొప్పాతి సూర్యం ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆయుధాలు కూడా భారీగా పట్టుబడ్డాయి. 303 రైఫిల్స్, ఏడు గన్స్, మూడు ల్యాండ్‌మైన్స్, 50 డిటోనేటర్లు, 4 గ్రెనేడ్లు, కిట్ బ్యాగులు, ఇతరత్రా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు దళ సభ్యులు పాంగి భాస్కరరావు అలియాస్ సూర్యం, పాంగి అప్పన్న అలియాస్ రామన్న, కొర్రా శ్రీరాములుతో పాటు 64 మంది మిలీషియా సభ్యులు, 18 మంది సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. 9 మంది దళ సభ్యులతో పాటు ఒక ఏసీఎం, 91 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు కూడా ఈ ఏడాది తమ ఉనికిని చాటుకున్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే కారణంతో ముగ్గురు గిరిజనులను హతమార్చారు. ముగ్గురు గిరిజన నాయకులను కిడ్నాప్ చేశారు. 13 సార్లు దాడులు జరిపారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం జీఓ విడుదల చేయడంతో మావోయిస్టులు దానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు ముమ్మరం చేస్తూ, కేడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ఇతర నేరాలు మాత్రం ఈసారి కాస్త తక్కువ నమోదయ్యాయి. 2014లో మొత్తం 5846 కేసులు నమోదు కాగా 2015లో 4899 కేసులు నమోదయ్యాయి. ఏడాది చివరిలో కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కలకలం రేగింది. వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్,అక్రమంగా ఇసుక రవాణా, పేకాట వంటి నేరాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు.
నెత్తుటి చారికలు
గత ఏడాది రోడ్లు రక్తమోడాయి. మొత్తం 329 మంది చనిపోయారు. గతేడాది (325)తో పోల్చితే ప్రమాదాల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరిగాయి. మహిళపై నేరాలు కూడా తగ్గాయి. ఈ ఏడాది 337 కేసులు నమోదైతే గతేడాది 371 కేసులు నమోదయ్యాయి. గతేడాది గంజాయి స్మగ్లర్లపై 198 కేసులే నమోదు కాగా, 2015లో 251 కేసులు పెట్టారు. మోటార్ వాహనాల తనిఖీలు బాగా పెరిగాయి. 2014లో కేవలం 146 మంది మందు బాబులను మాత్రమే పట్టుకున్నారు. 2015లో ఆ సంఖ్య ఐదు వేలు దాటింది. ఇసుక అక్రమ రవాణాపై 2014లో 280 కేసులు నమోదు చేస్తే 2015లో ఆ సంఖ్య మూడింతలయ్యింది. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏడాది 1540 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి తిమింగలాలు
నగరంలో గడిచిన ఏడాదిలో ఏసీబీ దాడుల్లో బోలెడు అవినీతి తిమింగాలు చిక్కడం చర్చనీయాంశమైంది. అర్బన్ డిప్యూటీ తహశీల్దార్ డి.శేఖర్, ఎంవీ ఇన్‌స్పెక్టర్ సంపదరావు, శ్రీకాకుళం మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ బాలా నాయక్, తదితరులు కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం దిగ్భ్రాంతి కలిగించింది.
విషాద వీచికలు
గడిచిన సంవత్సరంలో విశాఖ ప్రజానీకాన్ని విషాదంలో ముంచెత్తిన సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీతమ్మధారకు చెందిన చిన్నారి అదితి ట్యూషన్‌కు వెళ్లివస్తూ, డ్రైనేజీ కాలువలో వరద నీటిలో కొట్టుకుపోయిన సంఘటన అందరినీ ఆవేదనలో ముంచెత్తింది. అచ్యుతాపురం మండలం మోసయ్యపేట వాస్తవ్యులైన 22 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పడి ప్రాణాలు కోల్పోవడం కూడా కన్నీరు పెట్టించింది. మారికవలస వద్ద ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టి ఈడ్చుకు పోయిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం నివ్వెరపరిచింది. ఎస్.రాయవరం గోకులపాడులో బాణసంచా ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందడం, జోడుగుళ్ల పాలెం తీరంలో ముగ్గురు యువకులు, ఉక్కు నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులు వేరువేరు ఘటనల్లో సముద్రం అలలకు బలికావడం ఆవేదన కలిగించింది. పద్మనాభం మండలం, నరసాపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్ధులు క్రికెట్ ఆడుకుంటూ చెరువులో మునిగిపోయి కన్నుమూయగా, నగరం నడిబొడ్డులో కుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందడం నివ్వెరపరిచింది. తాటిచెట్లపాలెం దరి సంజీవయ్యనగర్‌లో కొండ చరియలు విరిగి ఒక ఇంటిమీద పడటంతో నలుగురు మృతి చెందడం కూడా వేదన మిగిల్చింది.
రక్తచరిత్ర
Published Thu, Dec 31 2015 11:22 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement
Advertisement