కాకరకాయ కూరలో మత్తుమందు పెట్టి..
- 9 తులాల బంగారంతో ఉడాయించిన తల్లీకొడుకులు
మేడ్చల్ రూరల్ (రంగారెడ్డి జిల్లా) : రెండు రోజుల క్రితం అద్దెకు దిగి.. అదే ఇంట్లో ఉన్న అత్తాకోడళ్లకు కాకరకాయ కూరలో మత్తుమంది కలిపి ఇచ్చి వారి ఒంటిపై ఉన్న మంగళసూత్రాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం పూడూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన తోకల రవికి భార్య నీరజ(35),ముగ్గురు పిల్లలు(శివాణి,మణికంఠ,వెంకటేశ్)లతో పాటు తల్లి రాములమ్మ(65),తండ్రి వెంకయ్యలు ఉన్నారు. వీరికి ఉన్న ఇంటిలో కింది భాగంలో వీరు ఉంటుండగా.. పై అంతస్థును అద్దెకు ఇచ్చారు.
వాటిలో ఒక గది ఖాళీగా ఉండడంతో ఇంటి ముందు టులెట్ బోర్డు పెట్టారు. దీంతో గత 15 రోజుల క్రితం ఇద్దరు వచ్చి తాము వరంగల్ జిల్లా ఆలేరు జనగాంకు చెందిన వారమని, ఇంట్లో అద్దెకు ఉంటామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. రెండు రోజుల క్రితం ఇంట్లో అద్దెకు దిగిన తల్లీకుమారులు సోమవారం రాత్రి ఇంటి యుజమాని రవి డ్యూటీకి వెళ్ళడంతో ఇదే అదునుగా భావించి ఇంటి ఇంట్లో ఉన్న రాములమ్మ(65), నీరజ(35)లకు మత్తు మందు ఇచ్చి వారి ఒంటిపై ఉన్న 9 తులాల మంగళసూత్రాలను దోచుకుని పారిపోయారు.
కూరలో మత్తుమందు కలిపి..
దొంగతనానికి ఒడిగట్టిన తల్లీకుమారులు.. ఇంటి యజమాని రవి నైట్ డ్యూటీ చేసేందుకు రాత్రి 8 గంటలకు ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి.. తమ వద్ద కాకరకాయలు ఉన్నాయని, వాటిని వండి ఇవ్వమని రవి భార్య నీరజను అడగగా ఆమె కూర చేసి ఇచ్చింది. ఆ సమయంలో మహిళ.. ఇంటి యజమాని రవి తల్లి రాములమ్మతో మాటలు చెప్పి దోస్తీ కుదుర్చుకుంది. ఇంట్లో ఉన్న పిల్లలతో కల్లు, కూల్‌డ్రింక్ తెప్పించుకుని కల్లును రాములమ్మ, మహిళ త్రాగగా.. పిల్లలు,నీరజ కూల్‌డ్రింక్ సేవించారు.
కూర అయిన తర్వాత తన కుమారుడికి వడ్డించి వస్తానని కూర తీసుకెళ్ళిన మహిళ కూరలో మత్తుమందు కలిపి మరో గిన్నెలో వేసుకుని కొద్దిసేపటి తర్వాత యజమానుల ఇంట్లోకి వచ్చి వారిని తినమని చెప్పింది. దీంతో రాములమ్మ, నీరజలు మత్తుమందు కలిపిన కూరను వేసుకుని తింటుండగా కూర ఏదో రకంగా అనిపిస్తుందని నీరజ అనగా కూర కొంచెం చేదుగా ఉండడంతో తాను బెల్లం కలిపానని ఆ మహిళ వారికి నచ్చజెప్పింది. మీరు కూడా కూర వేసుకోమని నీరజ ఆ మహిళను కోరగా తన కంచంలో కూడా అదే కూర ఉందని వారికి నచ్చజెప్పి తినిపించింది.
అనంతరం తాను కూడా మీ ఇంట్లోనే పడుకుంటానని మహిళ మాయమాటలు చెప్పి ఇంట్లోనే నిద్రించింది.అప్పటికే పిల్లలు కూడా నిద్రపోవడంతో పాటు రాములమ్మ,నీరజలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. తల్లీ కుమారులు పథకం ప్రకారం వారి ఒంటిపై ఉన్న 9తులాల బంగారు మంగళసూత్రాలను దోచుకుని వెళ్ళిపోయారు. మంగళవారం ఉదయం డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన రవి ఇంటి తలుపులు తెరచి ఉన్నాయని చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా భార్య,తల్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లారని గమనించడంతో పాటు చిన్నారులు రాత్రి ఇంట్లోనే పడుకుంటానని చెప్పిన మహిళ లేదని తెలుపడంతో దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న రాములమ్మ, నీరజలను 108 వాహనంలో మొదట స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి,ఎస్‌ఐ పవన్,గోపరాజు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు.తల్లీకుమారులు అద్దెకు ఉన్న ఇంట్లో వెతకగా క్షుద్రపూజల తరహాలో పూజలు చేసి ఉండడంతోపాటు గదిలో ఒక సిమ్‌కార్డును లభ్యమైంది. మత్తు నుండి కొంచెం స్పృహలోకి వచ్చిన నీరజను ఎలా జరిగిందని అడగగా కాకరకాయ కూర తినిపించిందని తెలిపింది. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.