ఆ శక్తి వైఎస్ జగన్‌కి ఉంది : రోజా
అన్నవరం: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ పిచ్చి భ్రమల్లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. దీనిని బట్టి లోకేశ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అర్థమవుతోందన్నారు. ప్రజస్వామ్యంలో ప్రతిపక్షం చాలా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం రోజా దంపతులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయస్వామిని దర్శించుకుని వ్రతం ఆచరించారు.
అనంతరం రోజా విలేకర్లతో మాట్లాడుతూ... లోకేశ్ తెలంగాణలో బీరాలు పలికి తొడగొట్టాడని... అక్కడ టీడీపీ ఖాళీ అయిపోయిందన్నారు. ఇక్కడ కూడా అలాంటి కబుర్లే చెబుతున్నాడని, త్వరలో ఏపీలోనూ టీడీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుందని రోజా జోస్యం చెప్పారు. నలుగురైదుగురు పార్టీని వీడినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడే ప్రసక్తే లేదన్నారు. వెళ్లిన వారు కూడా వ్యక్తిగత స్వార్థం కోసమేగానీ, రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్లలేదన్నారు.
అన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని వదలి వెళ్లిన వారు ఆలోచన చేసుకోవాలని సదురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి సూచించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని తయారు చేసుకుంటామని, ఆ శక్తి జగన్‌కు ఉందన్నారు.
చంద్రబాబు రాజకీయాలకు పట్టిన పీడ అని ఆమె ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని గతంలో ఎన్టీఆర్ తీర్మానం చేసిన విషయాన్ని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు పక్కన పట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు.