రౌడీషీటర్ రవి దారుణహత్య
రౌడీషీటర్ రవి దారుణహత్య
Published Thu, Dec 1 2016 11:31 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
గుంటూరు (పట్నంబజారు): గుంటూరు అరండల్‌పేటలో గురువారం సాయంత్రం ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగినట్లు తెలుస్తోంది. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శివనాగరాజు కాలనీ సమీపంలో ఆదిత్యనగర్‌కు చెందిన బొప్పన రవి (30) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు. మద్యం తాగి నిత్యం ఘర్షణలకు దిగే రవి ఆదినుంచీ వివాదాస్పదుడే. 2014 సంవత్సరంలో డొంకరోడ్డులోని కబేళాలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి బావిలో పడేశాడు. గుంటూరు రూరల్ పరిధిలోని రెడ్డిపాలెంలోనూ ఈ. రామకృష్ణ అనే వ్యక్తిని హత్య చేశాడు. వీటితో పాటు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిత్యం మద్యం సేవించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి డబ్బుల వసూళ్ల పాల్పడేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అరండల్‌పేట 3, 4వ లైన్లు రెండో అడ్డరోడ్డులో నడిచి వెళుతున్న రవిపై నలుగురైదుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పోలీసుల చెబుతున్నారు. విచక్షణారహితంగా నరకటంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఆటోలో వచ్చిన దుండగులు తిరిగి ఆటోలోనే అరండల్‌పేట మూడో లైనులో నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీలు జె. భాస్కరరావు, ఈ. సుబ్బరాయుడు, వెస్ట్ డీఎస్పీ కేజివి సరిత, అరండల్ పేట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఏవీ శివప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని తరలించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే
రవిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నాలుగో లైనులోని నుంచి మూడో లైనులో వస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవటం, అక్కడే ఉన్న ఒక వ్యాపార సంస్థకు ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చేయని సమయంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. మల్లికార్జునపేటకు చెందిన ఓ రౌడీషీటర్ తమ్ముడిని చంపుతానని మృతుడు ఇటీవల బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హత్య జరగడం అనుమానాలకు తావిస్తోంది.
గంట ముందే గొడవ....
రవి గురువారం సాయంత్రం అరండల్‌పేటలోని ఒక బార్‌లో పరిచయం ఉన్న వ్యక్తు లతో కలిసి మద్యం సేవించి, వారితోనే తగ వుకు దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నా రు. ఈ క్రమంలోనే రవి నడుచుకుంటూ వస్తుండగా హత్యకు గురైనట్లు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Advertisement