రౌడీషీట్‌ ఉన్నా పోలీస్‌గా..! | rowdy sheet on police | Sakshi
Sakshi News home page

రౌడీషీట్‌ ఉన్నా పోలీస్‌గా..!

Published Sat, Jun 10 2017 11:31 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

రౌడీషీట్‌ ఉన్నా పోలీస్‌గా..! - Sakshi

రౌడీషీట్‌ ఉన్నా పోలీస్‌గా..!

- స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌పై ఎస్పీకి నివేదిక
- ఉద్యోగంలో చేరక ముందు నుంచే
  మనోజ్‌ కుమార్‌పై పలు కేసులు
- హోంగార్డుపై దాడి ఘటన
  నేపథ్యంలో వెలుగులోకి
కర్నూలు : రాజ్‌విహార్‌ సెంటర్‌లో ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న హోంగార్డు హుసేన్‌పై దాడికి పాల్పడిన స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్లు మంచి వారు కాదని, వారిలో ఒకరిపై గతంలో రౌడీషీట్‌ ఉందని  కర్నూలు డీఎస్పీ రమణమూర్తి శనివారం ఎస్పీ ఆకే రవికృష్ణకు నివేదిక సమర్పించారు. ఈనెల 7వ తేదీన రాజ్‌విహార్‌ సెంటర్‌లో హోంగార్డుపై దాడి జరిగిన విషయం విదితమే. అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటో ఫుటేజ్‌ని కూడా ఎస్పీకి నివేదించారు. దాడి చేసిన  స్పెషల్‌ పార్టీ పోలీసులు మనోజ్‌కుమార్, మణికుమార్‌(వీరిరువురూ స్వయాన సోదరులు)లను ఎస్పీ సస్పెండ్‌ చేవారు. వీరిద్దరి నేరచరిత్రపై డీఎస్పీ పూర్తిస్థాయి విచారణ జరిపారు. కర్నూలు నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు మనోజ్‌కుమార్‌పై ఉన్నాయి. ఉద్యోగంలో చేరక ముందు ఐపీసీ 324 సెక్షన్‌ కింద పలు కేసులు ఉన్నట్లు సమాచారం. వీరి తండ్రి డేవిడ్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేటప్పుడు సహోద్యోగులతో ఏదో విభేదం తలెత్తింది. తన తండ్రిని వ్యతిరేకిస్తావా అంటూ 2011లో ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై స్నేహితుడు రాజేష్‌తో కలసి  మనోజ్‌కుమార్‌ ఆయుధంతో దాడి చేసి గాయపరిచాడు. అప్పుడు ఐపీసీ 332 సెక్షన్‌ కింద కేసు కూడా నమోదయ్యింది. 
 
కర్నూలు నగర పరిధిలోని ఏయే స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయనే విషయంపై సీఐలతో డీఎస్పీ ఆరా తీసి నివేదికను తయారు చేసి ఎస్పీకి సమర్పించారు. రెండో పట్టణ సీఐగా శ్రీనివాసులు ఉన్నప్పుడు రౌడీషీట్‌ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. మనోజ్‌కుమార్‌.. కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాల వరకు కూడా అతనిపై రౌడీషీట్‌ ఉండేది. 2015లో రౌడీషీట్‌ను క్లోజ్‌ చేయించుకున్నాడు. 
 
ఎస్‌బీ విచారణపై అనుమానాలు... 
ఉద్యోగం వచ్చిన వ్యక్తి పూర్వాపరాలు, నేరచరిత్రపై స్పెషల్‌ అధికారులు విచారణ జరపడం సాధారణం. మనోజ్‌కుమార్‌కు ఉద్యోగం వచ్చిన సమయంలో రౌడీషీట్‌ ఉన్నప్పటికీ విచారణలో ఆ అంశాన్ని ప్రస్తావించకుండ ఉన్నతాధికారులకు అప్పటి స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సమర్పించిన నివేదిక విషయంపై పోలీసు శాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనోజ్‌కుమార్‌ సోదరులకు అనుకూలంగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడానికి భారీ మొత్తం డబ్బులు చేతులు మారాయన్న చర్చ జరుగుతోంది. వాస్తవంగా రౌడీషీట్లకు సంబంధించిన ఇళ్లకు నెలకు ఒకసారి ఎస్‌ఐలు వెళ్లి వారి ప్రవర్తన గురించి ఆరా తీయాలి. అందుబాటులో ఉంటున్నారా.. లేక రాత్రివేళల్లో నేరాలకు పాల్పడుతున్నారా అనే అంశంపై కూడా నిఘా ఏర్పాటు చేయాలి. మనోజ్‌కుమార్‌ విషయంలో ఈ విధమైన విచారణ జరగకపోవడం వల్లే పోలీసు శాఖలో ఉద్యోగం పొందాడని ఆ శాఖ ఉన్నతాధికారులే చర్చించుకుంటున్నారు. తప్పుడు నివేదిక సమర్పించిన స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పనితీరుపై కూడా విచారణ జరిపితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ జరుగుతోంది. 
 
మనోజ్‌కుమార్‌ సోదరులపై కేసు నమోదు...
రాజ్‌విహార్‌ సెంటర్‌లో జరిగిన దాడి విషయంలో బాధితుడు హోంగార్డు హుసేన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదయ్యింది. మనోజ్‌కుమార్, మణికుమార్‌లపై సెక్షన్‌ 323, 353, రెడ్‌ విత్‌ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement