రౌడీషీటర్ దారుణ హత్య
రౌడీషీటర్ దారుణ హత్య
Published Sat, Dec 31 2016 9:59 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
– పట్ట పగలు నడిరోడ్డుపై దారుణం
– భయాందోళనకు గురైన స్థానికులు
నంద్యాల: పట్టణంలోని చాంద్‌బాడ ప్రాంతంలో ఓ రౌడీషీటర్ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఉదంతంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వన్‌టౌన్ ఎస్‌ఐ రమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రెవెన్యూ కోటర్స్‌కు చెందిన రాఘవేంద్ర అలియాస్ రఘు(35) లాయర్‌ను కలవడానికి వెళ్తూ చాంద్‌బాడలోని రామనాథ్ థియేటర్ వెనుక, సౌజన్య కాంప్లెక్స్ వద్ద బంధువుతో కొద్దిసేపు మాట్లాడాడు. తర్వాత బయల్దేరడానికి బైక్‌ను స్టార్ట్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రాడ్‌తో తలపై కొట్టడంతో రఘు కుప్పకూలిపోయాడు. అనంతరం పిడిబాకుతో గొంతు కోసి, హత్య చేసి పరారయ్యాడు. 2014 నవంబర్‌లో జరిగిన హత్య కేసులో రఘు ఏ1 నిందితుడు కావడంతో పాతకక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని ఎస్‌ఐ అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ హరినాథరెడ్డి, టూటౌన్ సీఐ గుణశేఖర్‌బాబు, వన్‌టౌన్ ఎస్‌ఐ రమణ సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు ఆరా తీశారు.
నిందితులను పట్టుకుంటాం..
నిందితులను పట్టుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో ఉన్న రఘు మృతదేహాన్ని ఎస్పీ పరిశీలించారు. సంఘటన గురించి డీఎస్పీ హరినాథరెడ్డి, రఘు సోదరుడు పుసులూరు సర్పంచ్ సతీష్‌ను అడిగి తెలుసుకున్నారు. 2014లో సోదరుడు బాలాంజనేయులును హత్యకు ప్రతికారంగానే ఆయన సోదరుడు బద్రి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించామన్నారు.
Advertisement