రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
Published Tue, Jan 10 2017 11:43 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
– పాతకక్షలే కారణమని తేల్చిన పోలీసులు
– నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, నాలుగు పిడుబాకులు స్వాధీనం
కర్నూలు: నంద్యాల పట్టణానికి చెందిన భవనాసి రాఘవేంద్ర అలియాస్ రఘు హత్య కేసులో నలుగురు నిందితులను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డుతో పాటు, నాలుగు పిడుబాకులను స్వాధీనం చేసుకొని నిందితులు నంద్యాల పట్టణానికి చెందిన కొమ్ముపాలెం బ్రహ్మయ్య, కొమ్ముపాలెం చంద్రశేఖర్, కొమ్ముపాలెం బాలాంజనేయులు, బొచ్చు శివకుమార్ తదితరులను మంగళవారం సాయంత్రం ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని సౌజన్య కాంప్లెక్స్ వెనుక వైపు రోడ్డులో తృప్తి మెస్ ఎదురుగా డిసెంబరు 31న భవనాసి రాఘవేంద్రను ప్రత్యర్థులు హత్య చేశారు. నంద్యాల మండలం పుసులూరు గ్రామానికి చెందిన రాఘవేంద్ర నంద్యాలలోని యోగా చైతన్య నగర్‌లో నివాసం ఉండేవాడు. లాయర్‌ను కలువడానికి సౌజన్య కాంప్లెక్స్ వెనుకవైపు గల రోడ్డులో చాంద్‌బాడ వైపు వెళ్తుండగా నిందితులు అడ్డగించి ఇనుపరాడ్డు, కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి అక్కడికక్కడే హత్య చేశారు. మృతుడి అన్న సతీష్‌కుమార్ ఫిర్యాదు మేరకు నంద్యాల ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా నంద్యాల చెరువుకట్ట దాటిన తర్వాత మూలమట్టం వద్ద నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. పాతకక్షలే హత్యకు కారణమని విచారణలో తేల్చారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసినందుకు డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐలు గుణశేఖరబాబు, ప్రతాప్‌రెడ్డితో పాటు క్రైమ్ పార్టి సిబ్బందిని ఎస్పీ అభినందించి వారికి రివార్డులను అందజేశారు.
జిల్లా బహిష్కరణకు ప్రతిపాదన:
కేసులో ప్రధాన నిందితుడైన కొమ్ముపాలెం బ్రహ్మయ్య అలియాస్ బద్రినాథ్, బొచ్చు శివశంకర్‌ను జిల్లా బహిష్కరణకు కలెక్టర్‌కు ప్రతిపాదించినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరు గతంలో కూడా అనేక నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు వివరించారు. శివకుమార్‌పై సుమారు 10 కేసులు ఉన్నాయని, కర్నూలులో జరిగిన ఒక హత్య కేసులో కూడా బద్రినాథ్ పాత్ర ఉందని వెల్లడించారు. రౌడీల కదలికలు కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అమలులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రౌడీల జాతకాలు మొత్తం పోలీసు శాఖ కంప్యూటర్‌లో పొందుపర్చనున్నట్లు వివరించారు. వారు ఎక్కడ నేరానికి పాల్పడినా తక్షణమే తెలిసి పోతుందని వెల్లడించారు.
Advertisement